ఆ విషయంలో బీజేపీకి జై కొట్టిన రాహుల్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని దేవె గౌడలకు ఆహ్వానం అందిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పందించారు.
2023 సంవత్సరానికి గాను G20 కూటమి శిఖరాగ్ర సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9, 10 తేదీలలో ఢిల్లీలో ఈ సదస్సు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సదస్సుకు జీ20 సభ్య దేశాలతోపాటు వివిధ దేశాల అధినేతలు కూడా హాజరు కాబోతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తదితరులు ఆల్రెడీ ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు జీ 20 సదస్సు విందు ఆహ్వానం అందలేదు.
క్యాబినెట్ మినిస్టర్ హోదాతో పాటు దేశంలోని అతిపెద్ద పార్టీకి అధ్యక్షుడు ఆయన ఖర్గేకు ఆహ్వానం అందకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ తోపాటు మరే ఇతర పార్టీల నేతలకు ఆహ్వానం అందలేదని ఆరోపణలు వస్తున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని దేవె గౌడలకు ఆహ్వానం అందిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పందించారు. జీ20 సదస్సుకు విపక్ష నేతను పిలవకపోవడం 60 శాతం మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారికి విలువ ఇవ్వకపోవడమే అని రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సదస్సు జరగడం మంచి పరిణామమేనని, కానీ, సదస్సుకు ఖర్గేను పిలవకూడదని నిర్ణయించుకోవడం సరికాదని అన్నారు. దేశంలో హింస, వివక్ష పెరిగిపోతున్నాయని, ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో దాడి జరుగుతుందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్మీర్ అభివృద్ధి, పురోగతిపై ప్రతిపక్షాలు కట్టుబడి ఉన్నాయని, ఆర్టికల్ 370పై తమకు స్పష్టత ఉందని రాహుల్ అన్నారు. భారత్ లో కాశ్మీర్ అంతర్భాగమని, ఆ విషయంలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వం అనే ప్రశ్న ఉత్పన్నం కాదని అభిప్రాయపడ్డారు.
రష్యా-ఉక్రెయిన్ వివాదంపై బీజేపీ అవలంబించిన వైఖరిని రాహుల్ గాంధీ సమర్ధించారు. ఆ దేశాల మధ్య యుద్ధం విషయంలో భారత్ తటస్థ వైఖరిని అవలంబించిందని రాహుల్ అన్నారు. మన దేశానికి రష్యాతో పాటు అమెరికాతోనూ మంచి సంబంధాలున్నాయని రాహుల్ చెప్పారు.