రాజలింగం హత్యకు-రాజకీయాలకు సంబంధం లేదు: పోలీసులు
భూపాలపల్లి జిల్లాకు చెందిన రాజలింగమూర్తి హత్య కేసును ఆ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు రాజకీయాలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.
భూపాలపల్లి జిల్లాకు చెందిన రాజలింగమూర్తి హత్య కేసును ఆ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు రాజకీయాలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఈ హత్య కేవలం భూ వివాదంలో చోటు చేసుకున్న ఘటనగా పోలీసులు తెలిపారు. దీంతో రాజలింగ మూర్తి హత్య చుట్టూ అల్లుకున్న రాజకీయ వివాదాలు దాదాపు సమసిపోయినట్టేనని తెలుస్తోంది. భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ రిజర్వాయర్ కుంగిపోయిన విషయం తెలిసిందే.
బీఆర్ ఎస్ హయాంలో చేపట్టిన ఈ రిజర్వాయర్ కుంగుబాటు ఘటనను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా.. దీనిపై రాజలింగమూర్తి న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు భూపాలపల్లి జిల్లాకోర్టులో విచారణ పరిధిలో ఉంది. అయితే.. ఈ క్రమంలో ఇటీవల రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. ఆ వెంటనే దీనికి రాజకీయ రంగు పులుముకుంది. ఏకంగా మంత్రి కోమటిరెడ్డే దీనిపై తీవ్ర విమర్శలు, వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ కుటుంబ అవినీతిని ఎత్తి చూపితే హత్యలు చేస్తారా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. కేసీఆర్ కుటుంబం నుంచి ప్రాణభయం ఉన్నవారు ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని కూడా సూచించారు. ఇక.. ఈవ్యవహారాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కూడా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో భూపాలపల్లి జిల్లా పోలీసులు ఘటనపై ముమ్మర విచారణ చేపట్టారు. ఈ క్రమంలో రాజలింగమూర్తి హత్య కుట్రలో పాత్రధారులు, సూత్రధారులైన ఏడుగురిని అరెస్టు చేశారు.
ఏంటి వివాదం..?
భూపాలపల్లి జిల్లాలో తమ భూమిని రాజలింగమూర్తి ఆక్రమించుకున్నారని నిందితులైన.. రేణుకుంట్ల సంజీవ, పింగళి హేమంత్ అలియాస్ బబ్లూ, మోరే కుమార్, కొత్తూరి కిరణ్, రేణికుంట్ల కొమురయ్య, దాసరపు కృష్ణ, రేణికుంట్ల సాంబయ్యలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్న వివాదం నేపథ్యంలో రాజలింగ మూర్తి తమను బెదిరించాడని.. అందుకే హత్య చేసినట్టు తెలిపారని పోలీసులు చెప్పారు. కాగా.. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేస్తున్నారు.