పీక్స్ కు రాజాసింగ్ ఫస్ట్రేషన్.. వెళ్లిపో అంటే వెళ్లిపోతాడట
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ గా నిలిచే బీజేపీ ఎమ్మెల్యే (గోషామహల్) రాజాసింగ్ తాజాగా తన ఫస్ట్రేషన్ బాంబ్ ను పేల్చారు.
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ గా నిలిచే బీజేపీ ఎమ్మెల్యే (గోషామహల్) రాజాసింగ్ తాజాగా తన ఫస్ట్రేషన్ బాంబ్ ను పేల్చారు. తాను పార్టీలో ఎదుర్కొంటున్న వేధింపుల్ని భరిస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. తానిక భరించలేకపోతున్నట్లుగా పేర్కొన్న అతడు.. పార్టీకి అవసరం లేదు వెళ్లిపో అంటే తాను పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ఒక మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భంలో వ్యాఖ్యానించారు.
2014లో తాను బీజేపీలో చేరినప్పటి నుంచి వేధింపుల్ని భరిస్తున్నట్లుగా పేర్కొన్న రాజాసింగ్.. ‘ఇక భరించలేకున్నా. పార్టీకి అవసరం లేదు వెళ్లిపో అని చెబితే ఇప్పటికిప్పుడు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా’ అంటై మరో సంచలనానికి తెర తీశారు. గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని తాను సూచన చేయగా.. అందుకు భిన్నంగా మజ్లిస్ నాయకులతో తిరిగే వారికి ఇవ్వటమేంటి? అని ప్రశ్నించారు.
పార్టీలో కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే.. ఈ ఎన్నిక విషయం తనకు తెలీదని చెప్పారని.. ఆ ఆన్సర్ తో తనపై దాగిన కుట్ర కోణం బయటకు వచ్చిందన్నారు. తాను ఇప్పటివరకు బీఆర్ఎస్..కాంగ్రెస్.. మజ్లిస్ నేతలతో యుద్ధం చేసుకుంటూ వచ్చానని.. సొంత పార్టీలోనూ యుద్దాన్ని కొనసాగించాల్సిన పరిస్థితిని ఎదురవుతుందన్న ఆవేదనను వ్యక్తం చేయటం గమనార్హం.
జిల్లా పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అన్నది పార్టీ ఎమ్మెల్యే లేదంటే ఎంపీ సూచన చేసిన వ్యక్తికి ఇవ్వటమనేది ప్రతి చోటా జరుగుతుందన్నారు. కానీ.. తన సూచనను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో తనకు సంజాయిషీ ఇవ్వాలన్న రాజాసింగ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన జీవితంలో ధర్మ ప్రచారం.. ధర్మ యుద్ధం నేర్చుకున్నానని చెప్పిన రాజాసింగ్.. ప్రస్తుతం పార్టీలో కొందరు ఫాలో అవుతున్న బ్రోకరిజాన్ని తాను నేర్చుకోలేదన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం రావల్సి ఉందని.. కొందరి కారణంగానే ఈ రోజు పార్టీ వెనుకబడిందన్నారు. రిటైరైన వ్యక్తులు పార్టీలో ఉంటే ఎప్పటికి బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త సంచలనానికి తెర తీశాయి. మరి.. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధినాయకత్వం ఎలా రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.