గోదారోళ్లకు గుడ్ న్యూస్... రాజమండ్రి విమానాశ్రయానికి కొత్త శోభ!
ఇందులో భాగంగా... రాజమండ్రి విమానాశ్రయంలో సుమారు 350 కోట్ల రూపాయల విలువైన కొత్త టెర్మినల్ భవనానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేశారు.
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమండ్రి విమానయాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా... రాజమండ్రి విమానాశ్రయంలో సుమారు 350 కోట్ల రూపాయల విలువైన కొత్త టెర్మినల్ భవనానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేశారు. దీంతో విమానయాన రంగంలో రాజమహేంద్రవరానికి కొత్త శోభ రానుందని అంటున్నారు.
అవును... రాజమండ్రి విమానాశ్రయానికి కొత్త టెర్మినల్ ను నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన శంకుస్థాపన తాజాగా జరిగింది. ఈ సందర్భంగా స్పందించిన మంత్రి జోతిరాదిత్య... 2014కు ముందు ఏపీలో 4 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవని అన్నారు. అయితే ఇప్పుడు ఆరు విమానాశ్రయాలు ఉన్నాయని చెప్పారు. ఎయిర్ ట్రాఫిక్ కూడా 2014లో 388 ఉండగా ఇప్పుడు 1,162కి పెరిగిందని తెలిపారు.
ఇదే సమయంలో... రాష్ట్రంలో కొత్తగా రెండు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు భోగాపురం, నెల్లూరుల్లో నిర్మిస్తున్నామని.. త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఇదే క్రమంలో 2030 నాటికి దేశంలో 200కి పైగా విమానాశ్రయాలు ఏర్పాటవుతాయని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చైర్మన్ సంజీవ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా టెర్మినల్ గురించిన వివరాలను తెలియజేసిన ఆయన... ఇందులో 30 చెక్ ఇన్ కౌంటర్లు, ఎక్స్ ప్రెస్ మెషీన్ లతో కూడిన ఎనిమిది భద్రతా లేన్ లు, మూడు ఏరోబ్రిడ్జ్ లు ఉంటాయని తెలిపారు.
కాగా... రాజమండ్రి విమానాశ్రయం నుంచి ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు అనుసంధానించబడి ఉన్న సంగతి తెలిసిందే. ఈ విమానాశ్రయం నుంచి వారానికి 126 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక తాజాగా చేపట్టిన కొత్త టెర్మినల్ భవనం 2025 చివరి నాటికి అందుబాటులోకి రానుందని అంటున్నారు.