బీజేపీ అనుకూల మీడియా పాత్రికేయుడి నోట కూడా జగన్ మాటే!
ఈ మీడియా కేంద్రంలోని బీజేపీకి అనుకూలమనే విషయం తెలిసిందే.
సాధారణంగా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మీడియా కూడా రెండు గా చీలిపోయింది. పార్టీలు, నాయకుల పరంగా చీలిన మీడియా వారికి అనుకూలంగా సర్వేలు.. విశ్లేషణలు చేస్తూ.. ఎన్నికల్లో అంతో ఇంతో సాయం చేస్తున్నాయి. ఇలాంటివాటిలో జాతీయ స్థాయిలో ఇండియా టుడే ఒకటి. ఈ మీడియా కేంద్రంలోని బీజేపీకి అనుకూలమనే విషయం తెలిసిందే.
అయితే.. తాజాగా ఈ మీడియా స్టార్ రిపోర్టర్, ఇన్‌పుట్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న రాజ్‌దీప్ సర్దేశాయ్.. ఏపీలో పర్యటించారు. ఆయన ఒక్కరోజు పర్యటించినా.. సుడిగాలి మాదిరిగా రాష్ట్రాన్ని చుట్టేశారు. విజయ వాడకు శనివారం ఉదయం చేరుకున్న దేశాయ్..బ్రేక్ ఫాస్ట్ నుంచే తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజయవాడలో బ్రేక్ ఫాస్ట్ చేస్తూనే.. సమైక్యాంధ్ర ఉద్యమ నేత చలసాని శ్రీనివాస్‌తో ముచ్చటించారు. ఏపీలో పరిస్తితులు అడిగి తెలుసుకున్నారు.
మధ్యాహ్నం.. విందును సీఎం జగన్ ఇంట్లో చేశారు. ఈసందర్బంగా జగన్ దంపతులతోకలిసి ఆయన భోజనం చేస్తూ.. సీమ పరిస్థితులు.. ఉత్తరాంధ్ర పరిస్థితులపై ఆరా తీశారు. వారి పార్టీ ఎన్నికల వ్యూహాలను కూడా.. తెలుసుకున్నారు. అనంతరం.. కొద్దిసేపు వీధుల్లో పర్యటించి.. ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎన్నికల నాడిని వేడిని పట్టుకునే ప్రయత్నం చేశారు.
తర్వాత.. ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలుసుకునేందుకు ఏలేశ్వరం వెళ్లారు. అక్కడ కొద్దిసేపు పవన్‌తో మాట్లాడిన దేశాయ్.. అనంతరం విశాఖకు వెళ్లారు. అప్పటికే చీకటి పడింది. అయినా.. ఆర్కే బీచ్‌లో పర్యటించి.. పలువురి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన తన దైన విశ్లేషణ చెప్పుకొచ్చారు. నేరుగా ఏపార్టీకీ ఆయన సర్టిఫికేట్ ఇవ్వకపోయినా మహిళలు, పేదలు.. బలమైన వర్గంగా ఆయన పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలను వీరే శాసిస్తున్నారని చెప్పారు.
వీరంతా జగన్ పాలనకు అనుకూలంగా ఉన్నారని దేశాయ్ వివరించారు. అంటే.. జగనే గెలుస్తున్నారన్న అర్థంలో మాట్లాడారు కానీ.. ఎక్కడా అలా చెప్పలేదు. అయితే.. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. బీజేపీకి అనుకూలంగా ఉన్న ఇండియా టుడే.. కూటమి(బీజేపీ-జనసేన-టీడీపీ)కి మార్కులు వేయకపోవడం గమనార్హం. పైగా.. జగన్ బలంగా ఉన్నాడని దేశాయ్ చెప్పడం వంటివి ఆసక్తిగా మారాయి.