చిలకలూరిపేట వైసీపీలో ముసలం... తెరపైకి సంచలన సమస్యలు!
ఇందులో భాగంగా జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న విడదల రజనీపై సొంతపార్టీ నేత మల్లెల రాజేష్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొన్ని నియోజకవర్గాల్లో జగన్ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల వ్యవహారం సరికొత్త సమస్యలను తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు కండువాలు మార్చేశారు. ఆ సంగతి అలా ఉంటే తాజాగా చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీలో పెద్ద దుమారమే రేగింది. ఈ క్రమంలో విడదల రజనీపై సొంతపార్టీ నేతే సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీలో సరికొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న విడదల రజనీపై సొంతపార్టీ నేత మల్లెల రాజేష్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా తనకు టిక్కెట్ ఇప్పిస్తానని చెప్పి రూ. 6.5 కోట్లు తనవద్ద నుంచి తీసుకున్నారని ఆరోపించారు. పైగా ఈ వ్యవహారంలో సజ్జల రామకృష్ణారెడ్డి పంచాయతీ చేశారని కూడా వ్యాఖ్యానించడంతో ఈ వ్యవహారం మరింత వైరల్ గా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... చిలకలూరిపేట సిట్టింగ్ ఎమ్మెల్యే, మంతి విడదల రజనీని అక్కడ నుంచి గుంటూరు వెస్ట్ ఇన్ ఛార్జ్ గా మార్చిన జగన్.. అదేరోజు చిలకలూరిపేట ఇన్ ఛార్జ్ గా మల్లెల రాజేష్ నాయుడిని నియమించా. ఈ అభ్యర్ధిత్వాన్ని నాడు రజనీ కూడా సమర్ధించారు! కట్ చేస్తే... తాజాగా చిలకలూరిపేట ఇన్ ఛార్జ్ గా మల్లెల రాజేష్ ని మార్చి, ఆయన స్థానంలో గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడిని బరిలోకి దించింది వైసీపీ.
ఇదే విషయాన్ని రెండు మూడు రోజుల క్రితమే రాజేష్ నాయుడికి వైసీపీ అధిష్టాణం క్లియర్ గా చెప్పిందని అంటున్నారు. అయితే తాజాగా ఈ విషయాలపై మైకందుకున్న ఆయన... తనను జగన్ వద్దకు తీసుకెళ్లిన రజనీ.. సీటు ఇప్పించినందుకు రూ.6.5 కోట్లు వసూలు చేశారని తెలిపారు! ఇప్పుడు ఆ సీటు తనకు లేకుండా పోవడంతో తన డబ్బులు తిరిగి తనకు ఇప్పించాలని అడిగితే పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పైగా ఈ విషయంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద పంచాయితీ పెట్టగా... రజనీ నుంచి తనకు రూ. 3.5 కోట్లు ఇప్పించారని రాజేష్ నాయుడు వెల్లడించారు. ఇదే సమయంలో తనను మార్చాలనుకుంటే... ఆ స్థానంలో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కు సీటు ఇవ్వాలని.. అతనికి టిక్కెట్ ఇస్తే రూ.20 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఎక్కడో గుంటూరు నుంచి మనోహర్ ని పేటకు తెస్తే అతని గెలుపుకోసం పనిచేసేందుకు సిద్ధంగా లేమని అన్నారు. దీంతో పేట వైసీపీలో కొత్త రచ్చ తెరపైకి వచ్చింది. దీంతో... రాజేష్ నాయుడు లేవనెత్తిన అంశాలపై అధిష్టాణం ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తిగా మారింది. ఈ ఆరున్నర కోట్ల విషయంపై మంత్రి విడదల రజనీ వెర్షన్ ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి!!