విడదల రజనీ కి రెడ్ సిగ్నల్ ?

అప్పటిదాకా ఆ సీటుని నమ్ముకుని ఉన్న సీనియర్ నేత మర్రి రాజశేఖర్ ని పక్కన పెట్టి మరీ రజనీకి చాన్స్ ఇచ్చారు.

Update: 2024-10-22 19:30 GMT

రాజకీయాల్లో కొందరు చాలా తొందరగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. అనూహ్యంగా పదవులు అందుకుంటారు. బహుశా వారు లక్కిని తొక్కి వచ్చి ఉంటారు అని అంటూంటారు. బహుశా కోవలోకి వచ్చే రాజకీయ నాయకురాలుగా విడదల రజనీని చూస్తారు. ఆమె ఎంట్రీ టీడీపీలో జరిగినా అవకాశాలు మాత్రం వైసీపీ అందించింది. 2019 ఎన్నికలకు ముందు ఆమె టీడీపీ నుంచి వైసీపీలోకి చేరడం ఆ వెంటనే చిలకలూరిపేట టికెట్ ని ఆమెకు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. అప్పటిదాకా ఆ సీటుని నమ్ముకుని ఉన్న సీనియర్ నేత మర్రి రాజశేఖర్ ని పక్కన పెట్టి మరీ రజనీకి చాన్స్ ఇచ్చారు.

ఇక వైసీపీ ప్రభంజనం, బీసీ నినాదంతో అప్పటికే మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావుని రజనీ ఓడించేశారు. వైసీపీలో ఆమెకు రెండవ విడతలో మంత్రిగా చాన్స్ కూడా దక్కింది. అయితే తనకు దక్కిన అవకాశాన్ని ఆమె పూర్తిగా వాడుకోలేకపోయారు అని అంటున్నారు. ఆమె చిలకలూరిపేట వైసీపీలో వర్గ పోరుకి కారణం అయ్యారని కొన్ని వర్గాలను ప్రోత్సహించారని తన గెలుపునకు సహకరించిన మర్రి రాజశేఖర్ వంటి వారిని సైడ్ చేశారని కూడా చెప్పుకున్నారు.

ఇక మంత్రి అయిన తరువాత చిలకలూరిపేటలో ఆమె దందాలకు తెర తీశారని ప్రత్యర్థి పార్టీలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల ముందు ఆమె గ్రాఫ్ బాగా తగ్గడంతో ఆమెను చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్ కి షిఫ్ట్ చేశారు. అయితే అక్కడ కూడా ఆమె దాదాపుగా యాభై వేల భారీ ఓట్ల తేడాతో ఓటమి చెందారు.

ఇక ఇపుడు మళ్లీ ఆమె చిలకలూరిపేట వైపు చూస్తున్నారని టాక్. వైసీపీలో కొందరి పెద్దల సహకారంతో ఆమె వైసీపీ ఇంచార్జి గా అక్కడ ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంలో చిలకలూరిపేట వైసీపీ క్యాడర్ మాత్రం రజనీకి నో చెబుతోంది అని అంటున్నారు. ఆమెని ఇంచార్జిగా తీసుకుని రావద్దు అని వారు అధినాయకత్వాన్ని కోరుతున్నారుట.

రజనీ వద్దు మర్రి రాజశేఖర్ నే ఇంచార్జిగా ప్రకటించండి అని కోరుతు న్నారని అంటున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న మర్రి రాజశేఖర్ అయితేనే పార్టీ బలపడుతుందని పైగా క్యాడర్ కూడా పనిచేస్తుందని వారు అంటున్నారుట. కాదూ కూడదని రజనీని తెస్తే కనుక వైసీపీ చిలకలూరిపేటలో ఆశలు వదులుకోవాల్సి వస్తుందని కూడా అంటున్నారుట. మరి ఈ విషయంలో వైసీపీ హై కమాండ్ ఏ విధంగా డెసిషన్ తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది. మరి రజనీని ఒకసారి గెలిపించి ఆ మీదట మంత్రి భగ్యానికి కారణం అయిన చిలకలూరిపేట వైసీపీ జనమే వద్దు అనుకుంటే ఆమెకు వేరే సీటేదీ చోటేదీ అన్న చర్చ కూడా సాగుతోంది.

Tags:    

Similar News