విచారణకు డుమ్మా.. సీఐడీని 8 వారాల గడువు కోరిన ఆర్జీవీ
వివాదాస్పద రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీని ఆంధ్రప్రదేశ్ సీఐడీ శాఖ (గుంటూరు) 10 ఫిబ్రవరి తారీఖున విచారణ కోసం హాజరుకావాల్సిందిగా నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే
వివాదాస్పద రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీని ఆంధ్రప్రదేశ్ సీఐడీ శాఖ (గుంటూరు) 10 ఫిబ్రవరి తారీఖున విచారణ కోసం హాజరుకావాల్సిందిగా నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉండగా, వర్మ యథావిధిగా డుమ్మా కొట్టారు. సీఐడీ ఇన్ స్పెక్టర్ తిరుమలరావుకు వాట్సాప్ ద్వారా ఈ సమాచారాన్ని చేరవేసారు ఆర్జీవీ. ఈనెల 28న విడుదల కానున్న ఓ చిత్రానికి ప్రచారం నిర్వహించాల్సి ఉన్నందున 8 వారాల గడువు ఇవ్వాలని వర్మ సీఐడీని అభ్యర్థించారు. ఆ తర్వాత తాను విచారణకు హాజరవుతానని ప్రామిస్ చేసారు.
ఆర్జీవీ విచారణకు హాజరు కాలేకపోవడానికి కారణాలను, అతడి తరపు న్యాయవాది నాని బాబు వెల్లడించారు. ఇటీవల ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆర్జీవీకి నోటీసులు అందిన సంగతి తెలిసిందే. `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` పేరుతో సినిమా తీసిన ఆర్జీవీపై అప్పట్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. మనోభావాలు దెబ్బ తీసారంటూ ఆర్జీవీపై తెలుగు యువత రాష్ట్ర ప్రతినిధి బండారు వంశీ కృష్ణ గత ఏడాది నవంబర్ 29న కేసు వేసారు. ఈ కేసు విచారణ నిమిత్తం వర్మను గుంటూరు రూరల్ పోలీసులు విచారణకు రావాల్సిందిగా నోటీస్ ఇచ్చారు. ఇటీవల విచారణకు హాజరైన వర్మను పోలీసులు దాదాపు 9 గం.ల పాటు ప్రశ్నించారు. వాటికి ఆయన సమాధానాలిచ్చారు.
ఇప్పుడు ఆర్జీవీకి గుంటూరు సీఐడీ ఆఫీస్ నుంచి నోటీసు అందగా, నేటి విచారణకు వర్మ డుమ్మా కొట్టారు. 8 వారాల సమయం కోరుతూ సీఐడీ సీఐ తిరుమలరావుకు వాట్సాప్ సందేశం పంపారు. దీనిపై లాయర్ తో ప్రకటన వెలువరించారు. ఆర్జీవీ తన సోషల్ మీడియాల్లో రిలీజ్ కావాల్సిన సినిమాలు, కథానాయికల ఫోటోలను షేర్ చేస్తూ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
అసలు గొడవేంటి?
2019లో ఆర్జీవీ సినిమా `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు`పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ ఒక సామాజిక వర్గం కేసులు ఆరోపించగా, ఆ తర్వాత `అమ్మ రాజ్యంలో కడప రెడ్లు` పేరుతో థియేటర్లలో విడుదల చేసారు. ఆ తర్వాత యూట్యూబ్ లో ఉద్ధేశపూర్వకంగానే టైటిల్ ని మార్చకుండా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో విడుదల చేసారని ఆరోపిస్తూ వంశీకృష్ణ గుంటూరు రూలర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ సాగుతోంది. ఇంతలోనే సీఐడీ విచారణ కూడా షురూ అయింది.