ఒంగోలులో ముగిసిన ఆర్జీవీ విచారణ... నెక్స్ట్ గుంటూరు సీఐడీ వంతు!

దీంతో.. మద్దిపాడు మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆర్జీవీపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Update: 2025-02-07 17:12 GMT

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు "వ్యూహం" అనే చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత సీఎం పవన్ తో పాటు నారా లోకేష్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఎక్స్ లో పోస్టులు పెట్టిన విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

దీంతో.. మద్దిపాడు మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆర్జీవీపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి ఒంగోలు రూరల్ పోలీసుల ఎదుట రామ్ గోపాల్ వర్మ ఈ రోజు హాజరవ్వగా.. ఆ విచారణ శుక్రవారం రాత్రి ముగిసింది. సుమారు 9 గంటలకు పైగా ఆర్జీవీని సీఐ శ్రీకాంత్ బాబు విచారించారు!

అవును.. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో రామ్ గోపాల్ వర్మ విచారణ ముగిసింది. ఈ విచారణకు వర్మ.. తన న్యాయవాదితో పాటు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు అర్జీవీ కోసం సుమారు 100 ప్రశ్నలు సిద్ధం చేయగా.. చాలా వాటిని మౌనమే వర్మ సమాధానంగా మారిందనే ప్రచారం జరుగుతుంది.

అయితే... నాడు తన సోషల్ మీడియా అకౌంట్ లో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ లపై పెట్టిన పోస్టులు.. మార్ఫింగ్ చేసి తానే పెట్టినట్లు అంగీకరించారని అంటున్నారు. ఇది సినిమా ప్రమోషన్ లో భాగంగానే చేసినట్లు వర్మ అంగీకరించారని తెలుస్తోంది. అయితే.. ఈ పోస్టులకు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని వర్మ చెప్పారని సమాచారం!

ఈ విచారణలో వైసీపీ నేతలతో ఉన్న సంబంధాలపైనా పోలీసులు ఆరా తీయగా.. వైసీపీ నేతలతో తనకున్నవి వ్యక్తిగత పరిచయాలు మాత్రమే అని వర్మ చెప్పారని అంటున్నారు. అంతకు మించి పార్టీతో తనకు సంబంధాలు లేవని సమాధానం చెప్పారని తెలుస్తోంది.

ఇక ఇటీవల సంచలనంగా మారిన ఏపీ ఫైబర్ నెట్ నుంచి రూ.2 కోట్లు ఆర్జీవీకి కేటాయించారనే విషయాలపై ఒంగోలు పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన వర్మ.. జరిగిన విషయం మొత్తం చెప్పారని.. ఇటీవల దానిపై ఎక్స్ వేదికగా ఇచ్చిన వివరణే పోలీసుల ముందు ఇచ్చారని సమాచారం!

ఈ రోజు పోలీసు విచారణకు వచ్చే ముందు వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని కలవడంపైనా ప్రశ్నలు సంధించారని తెలుస్తోండగా.. వాటిని కేవలం వ్యక్తిగత పరిచయాలుగానే వర్మ సమాధానం చెప్పారని తెలుస్తోంది.

ఈ విచారణ సమయంలో మధ్యలో తనకు వెజ్ లంచ్ ఏర్పాటు చేయాలని వర్మ కోరగా.. పోలీసులు ఆ ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు! దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది!

మరో కేసులో నోటీసులు!:

ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మను పోలీసులు సుమారు 9 గంటలు విచారించగా.. తాజాగా ఆ విచారణ ముగిసింది. ఈ సమయంలో ఆర్జీవీకి మరో కేసులో నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. ఇందులో భాగంగా... మరో కేసులో గుంటూరు సీఐడీ సీఐ తిరుమల రావు.. ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారని సమాచారం! దీంతో.. ఆర్జీవీపై ఏపీలో ఉన్న అన్ని కేసులకు సంబంధించి విచారణ పూర్తి చేసే అవకాశాలున్నాయనే చర్చ తెరపైకి వచ్చింది.

Tags:    

Similar News