నోటీసులు అందించిన పోలీసులు... అర్జీవీ పిక్ విత్ స్మైల్ వైరల్!

ఈ క్రమంలో ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశారు. మరికొంతమందిని అరెస్ట్ చేసి, పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నారని అంటున్నారు

Update: 2024-11-13 07:02 GMT

సోషల్ మీడియా వేదికలుగా రాజకీయ ప్రముఖులపై అసభ్యకరమైన పోస్టులు, వారి కుటుంబంలోని మహిళలపై అసహ్యకరమైన కామెంట్లు, ఫోటోలు పెట్టినవారిపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశారు. మరికొంతమందిని అరెస్ట్ చేసి, పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నారని అంటున్నారు.

ఈ విషయంలో పార్టీల పరంగా తారతమ్యాలు చూసే ప్రసక్తి లేదని.. వైసీపీ నాయకుల కుటుంబంలోని మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినవారిని కూడా వదిలేదు లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సమయంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్ కు చెందిన పోలీసులు హైదరాబాద్ వెళ్లి నోటీసులు జారీ చేశారు.

అవును.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతోపాటు వారి వారి కుటుంబ సభ్యులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు మేరకు మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా కేసు విచారణకు హాజరుకావాలంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు సిద్ధం చేసిన పోలీసులు.. వాటిని అందజేసేందుకు ఏఎస్సై శివరామయ్య ఆధ్వర్యంలోని బృందం ఒంగోలు నుంచి హైదరాబాద్ కు బయలుదేరింది.

ఈ మేరకు మంగళవారం రాత్రి ఒంగోలు నుంచి బయలుదేరిన ఈ పోలీస్ టీమ్.. బుధవారం ఆర్జీవీకి నోటీసులు అందజేసింది. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఎక్స్ లో పోస్ట్ అయిన ఈ ఫోటోలో ఆర్జీవీ పోలీసుల నుంచి నోటీసులు అందుకుంటూ కనిపించారు.

ఇక ఈ పోస్టుకు సంబంధించిన కామెంట్ సెక్షన్ కి వెళ్తే... ఆ ఫోటోలో నవ్వుతూ కనిపించిన ఆర్జీవీని ఉద్దేశించి... "ప్రశంసా పత్రంలాగా ఏమిటి సార్ ఆ స్మైలు" అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మరోవైపు తుళ్లూరులోనూ ఆర్జీవీపై కేసు నమోదైంది. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ ల ఫోటోలను రామ్ గోపాల్ వర్మ గతంలో మార్ఫింగ్ చేసి పోస్టులు పెట్టారంటూ రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News