లడ్డూ వివాదంపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు!

తిరుమల శ్రీవారి లడ్దూపై నెలకొన్న వివాదం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-20 07:23 GMT

తిరుమల శ్రీవారి లడ్దూపై నెలకొన్న వివాదం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా నెయ్యి నాణ్యతను ఎత్తి చూపుతూ అధికారపక్షం.. ఎలాంటి విచారణకైనా సిద్ధమంటూ ప్రతిపక్షం నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకుంటున్న వేళ.. భక్తకోటి మాత్రం గందరగోళంలో ఉన్నారని అంటున్నారు. ఈ సమయంలో రమణ దీక్షితులు స్పందించారు.

అవును... తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని, జంతువుల కొవ్వు వాడారంటూ తీవ్ర వివాదం నెలకొంటున్న వేళ టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందించారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చాలా బాధ కలిగించాయని.. ఇది శ్రీవారి భక్తులకు బాధాకరమైన విషయమని.. తాను కూడా చాలా బాధపడినట్లు చెప్పుకొచ్చారు.

అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. తిరుమలల్లో ప్రసాదాల నాణ్యతపై గతంలో తాను ఎన్నోసార్లు టీటీడీ ఛైర్మన్, ఈవో దృష్టికి తీసుకెళ్లానని.. అయినా లాభం లేకపోయిందని అన్నారు. ఇదే సమయంలో... పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించడం అపచారమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా... శ్రీవారి నైవేద్యాల క్వాలిటీ విషయంలో తాను ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పిన రమణ దీక్షితులు... తనది ఒంటరి పోరాటం అయిపోయిందని.. వారి వారి వ్యక్తిగత కారణాలవల్ల తోటి అర్చకులెవరూ ముందుకు రాలేదని.. ఫలితంగా... గత ఐదేళ్లూ నిరభ్యంతరంగా ఈ మహా పాపం జరిగిపోయిందని దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను ఇలాంటి తప్పులను గతంలో ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లడంతోనే తనపై కేసులు పెట్టారని.. తనపై ఉన్న తప్పుడు కేసులను ఈ ప్రభుత్వం తొలగించాలని.. కేసులు తొలగిస్తే తాను తిరిగి స్వామివారి సేవ చేయడానికి సిద్ధమని రమణ దీక్షితులు అన్నారు. ప్రసాదాల విషయంలో వందల ఏళ్లుగా వస్తున్న ఆచారాలు కొనసాగాలని తెలిపారు.

ఇదే సమయంలో... నెయ్యి పరీక్షలకు సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు తాను చూసినట్లు చెప్పిన రమణ దీక్షితులు.. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు అందులో ఉందని అన్నారు. శ్రీవారి ఆలయంలో ఇటువంటి తప్పులు జరిగితే ఆగమశాస్త్రం ప్రకారం పరిహారం చేయాలని.. దీనికోసం నిష్ణాతులైన ఆగమ పండితుల సలహాలు తీసుకోవాలని దీక్షితులు సూచించారు.

Tags:    

Similar News