ప్లాన్ ఇదే: టీటీడీకి వెయ్యి గోవులు ఇస్తా.. లక్ష గోవుల్ని ఇప్పిస్తా

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన ఆవునెయ్యిలో జంతుకొవ్వు ఉన్నట్లుగా వచ్చిన రిపోర్టులతో రేగిన దుమారం అంతా ఇంతా కాదు.

Update: 2024-10-06 04:36 GMT

వ్యక్తులు చేయలేని పనులు వ్యవస్థలు చేసేయొచ్చు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన ఆవునెయ్యిలో జంతుకొవ్వు ఉన్నట్లుగా వచ్చిన రిపోర్టులతో రేగిన దుమారం అంతా ఇంతా కాదు. దీనిపై రచ్చ ఇంకా సాగు..తూనే ఉంది. ఆవునెయ్యి కోసం ప్రైవేటు డెయిరీల మీద ఎందుకు ఆధార పడాల్సిన అవసరం ఏంటి? తిరుమల శ్రీవారికి ఏం తక్కువ? మంది.. మార్బాలనికి కొదవ లేదు. అడగాలే కానీ కోట్లాది రూపాయిలు కాసులు ఇచ్చేందుకు భక్తకోటి సిద్దంగా ఉంటారు. అలాంటప్పుడు టీటీడీ తన సొంత డెయిరీని ఎందుకు ఏర్పాటు చేసుకోదు..? అన్నది ప్రశ్న.

లడ్డూ ప్రసాద వివాదం వేళ బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. తన వంతుగా వెయ్యి ఆవుల్ని ఇస్తానని.. మరో లక్ష గోవుల్ని ఇప్పించే బాధ్యత తీసుకుంటానని పేర్కొనటం తెలిసిందే. తన వాదనకు బలం చేకూరేలా తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. అందులో టీటీడీ సొంత డెయిరీ ఎలా సాధ్యమన్న విషయాన్ని తెలియజేయటమే కాదు.. దానికి సంబంధించిన తన ప్లాన్ ను వివరించిన వైనం ఆసక్తికరంగా మారింది.

రోజుకు దగ్గర దగ్గర లక్షమంది భక్తులు.. రూ.5 కోట్ల ఆదాయం వచ్చే టీటీడీ.. తన ప్రసాదానికి అవసరమైన ఆవునెయ్యిని తన సొంత డెయిరీలో ఉత్పత్తి చేసుకోవటం కష్టమైన విషయమే కాదు. రామచంద్ర యాదవ్ చెప్పినట్లు లక్ష గోవులతో భారీ ఫాం ఏర్పాటు చేస్తే.. వాటితో రోజుకు కనీసం 10 లక్షల లీటర్ల ఆవుపాలు ఉత్పత్తి అవుతాయి. వాటి నుంచి రోజుకు 50వేల కేజీల వెన్న తీస్తే.. 30 వేల కేజీల నెయ్యి తయారు చేసే వీలుంది.

ఈ నెయ్యిలో సగాన్ని స్వామి అవసరాలకు వాడి.. మిగిలిన నెయ్యిని ఏపీలోని ఇతర ప్రసిద్ధ ఆలయాలకు పంపటం ద్వారా కల్తీ నెయ్యి సమస్యను తేలికగా సమకూర్చొచ్చు. దీంతో విషయాలు పారదర్శకంగా ఉండటంతో పాటు.. నాణ్యమైన ఆవునెయ్యిని టీటీడీ తమకు తామే తయారు చేసుకునే వీలు ఉంటుంది. అంతేకాదు.. అన్నదాన పథకాల మాదిరి.. గోవు సంరక్షణ.. డెయిరీ నిర్వహణ కోసం ఏదైనా పథకాన్ని ఏర్పాటు చేస్తే.. లక్ష గోవుల్ని సాకేందుకు అవసరమైన నిధులు మొత్తం భక్తులే ఇచ్చేస్తారు. ఇంత అవకాశం ఉన్నప్పుడు సొంత గోశాలను.. సొంత డెయిరీ మీద ఎందుకు ఫోకస్ చేయరన్నది ప్రశ్న.

రామచంద్ర యాదవ్ సూచనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి. అంతేకాదు.. అతడు మరో ఆసక్తికర సూచన చేవారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే టీటీడీ పాలక మండలిలో రాజకీయ.. పారిశ్రామిక.. కార్పొరేట్ రంగాలకు చెందిన వ్యక్తులు కాకుండా ఛైర్మన్ మొదలుకొని పాలక మండలిలోని వారంతా ఆధ్యాత్మిక గురువులు.. ధార్మిక ప్రతినిధులు ఉండేలా చూస్తే మరింత బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కూడా చంద్రబాబు పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News