ఢిల్లీ బీజేపీకి బిగ్ ట్రబుల్ గా ఆయన ?
బీజేపీలో ఎందరో ట్రబుల్ షూటర్స్ ఉంటారు. కానీ ట్రబుల్స్ తెచ్చేవారిని ఆ పార్టీ అసలు ఉండనీయదు.
బీజేపీలో ఎందరో ట్రబుల్ షూటర్స్ ఉంటారు. కానీ ట్రబుల్స్ తెచ్చేవారిని ఆ పార్టీ అసలు ఉండనీయదు. ఎందుకంటే బీజేపీని తేడా పార్టీగా చెబుతారు. బీజేపీలో అత్యంత క్రమశిక్షణ ఉంటుంది. ఆరెస్సెస్ నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉంటారు.
అయితే కొన్నిసార్లు బీజేపీలో కూడా వివాదాలు రాజేసే వారు కనిపిస్తారు. ఇపుడు అలాంటి నేతగా ఢిల్లీ సీఎం అతిషీ మీద పోటీ చేస్తున్న రమేష్ బిధూరీ మారుతున్నరా అన్న చర్చ సాగుతోంది. ఆయన వరసబెట్టి చేస్తున్న వివాదాస్పద కామెంట్స్ ని చూసిన వారు వింటున్న వారు ఇదేమిటి అని ఆశ్చర్యపోతున్నారు.
తాను గెలిస్తే తన నియోజకవర్గాన్ని కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకా గాంధీ బుగ్గల మాదిరిగా నున్నగా అభివృద్ధి చేస్తాను అని కొద్ది రోజుల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చి వివాదాల్లోకి వచ్చిన రమేష్ బిధూరీ ఇపుడు మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు.
తన ప్రత్యర్ధి ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన అతీషీ మీద ఆయన ఈసారి కామెంట్స్ చేశారు. ఆమె ఓట్ల కోసం జింకలా పరిగెడుతోంది అంటూ ఆయన చేసిన ఈ కామెంట్స్ మళ్లీ రాజకీయంగా రచ్చ రేపుతున్నాయి. ఇప్పటికే అతిషీ తన తండ్రి పేరును మార్చేసిందని వివాదాస్పద విమర్శలు చేసిన రమేష్ బిధూరీ ఇపుడు ఆమెను మరోసారి టార్గెట్ చేశారు.
ఆమె ఓట్లను రాబట్టుకోవడం కోసం జింకలా తిరుగుతోంది అంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను ఆప్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన ఏమన్నారంటే గడచిన నాలుగైదేళ్లుగా ఆమె తన నియోజకవర్గం ప్రజలను అసలు కలవలేదని వారిని వదిలిపెట్టేసిందని. అంతే కాదు ఆమె ప్రజల కష్ట సుఖాలు అసలు పంచుకోలేదని అన్నారు. అయితే ఇపుడు ఎన్నికలు ఉన్నాయని ఆమె జనంలోకి వస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయం కాబట్టి ఆమె అడవిలో జింక మాదిరిగా పరుగులు తీస్తున్నారు అని ఆయన విమర్శించారు.
ఇక దీని మీద ఆప్ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్ అయితే ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ అన్ని పరిమితులు దాటేసిందని నిందించారు. ఒక మహిళా సీఎం అని కూడా చూడకుండా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. దీనిని ఢిల్లీ మహిళా లోకం అసలు సహించదని మొత్తానికి మొత్తం 70 అసెంబ్లీ సీట్లలో ఉన్న మహిళలు అంతా బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారు అని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే ప్రియాంకా గాంధీ మీద రమేష్ బిధూరీ చేసిన వ్యాఖ్యలతో ఆయన అభ్యర్ధిత్వం బీజేపీ మారుస్తుందని ప్రచారం సాగింది. కానీ అలా జరగలేదు, ఇపుడు ఆయన మరింత డోస్ పెంచేశారు. బీజేపీకి బిగ్ ట్రబుల్ గా మారుతున్నారు అని అంటున్నారు. ఆప్ తో చావో రేవో అని పోరాడుతున్న బీజేపీకి మహిళా ఓట్లు కీలకంగా ఉంటాయి. మరి ఇలాంటి వ్యాఖ్యలతో ఆ ఓట్లకు రమేష్ బిధూరీ లాంటి వారు గండి కొడతామంటే ఆ పార్టీ చూస్తూ ఊరుకుంటుందా అన్నది ఆలోచించాల్సిందే అంటున్నారు.