'అగ్ని మ్యాన్' కన్నుమూత... రామ్ నారాయణ్ గురించి తెలుసా?
అవును... ప్రముఖ డీఆర్డీవో శాస్త్రవేత్త డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్.. గురువారం హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు.
అగ్ని క్షిపణుల రూపకర్తగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ డీఆర్డీవో శాస్త్రవేత్త డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ (84) కన్నుమూశారు. భారతదేశ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అగ్ని క్షిపణులకు సాంబంధించిన మొదటి ప్రోగ్రామ్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఆయనను.. "అగ్ని మ్యాన్" గా పేర్కొంటున్నట్లు డీఆర్డీవో వర్గాలు వెల్లడించాయి.
అవును... ప్రముఖ డీఆర్డీవో శాస్త్రవేత్త డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్.. గురువారం హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ మృతి విచారణకరమని డీఆర్డీవో పేర్కొంది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందిస్తూ... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించింది.
మరోవైపు డాక్టర్ రామ్ నారాయణ్ మృతిపట్ల పలువురు శాస్త్రవేత్తలతో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా డీఆర్డీవో ఒక లెజెండ్ ను కోల్పోయిందని ఆ సంస్థ మాజీ చీఫ్, క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్ జి సతీశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అగర్వాల్ మృతి పట్ల డీఆర్డీవో ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. ఇదే క్రమంలో రెండు దశాబ్ధాలకు పైగా అగ్ని క్షిపణి ప్రోగ్రామ్ కు సారథ్యం వహించారని కొనియాడింది.
కాగా... రామ్ నారాయణ్ అగర్వాల్ జూలై 24 - 1941న జన్మించారు. మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ఉన్నత విద్యనభ్యసించారు. ఈ నేపథ్యంలోనే 1983లో ప్రారంభమైన అగ్ని క్షిపణి కార్యక్రమానికి ఆయన సుమారు రెండు దశాబ్ధాల పాటు నాయకత్వం వహించిన ఘటన సాధించారు.
1995లో అగ్ని-2 ఆయుధీకరణ, విస్తరణ కోసం ప్రోగ్రాం డైరెక్టర్ గా రామ్ నారాయణ్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో 1999 నాటికి రామ్ నారాయణ్, ఆయన టీం అగ్ని-1 తో పోలిస్తే అధిక ప్రయోగ సామర్థ్యంతో కొత్త వెర్షన్ ను అభివృద్ధి చేశారు. ఇదే క్రమంలో అగ్ని-3 క్షిపణి అభివృద్ధికీ ఆయన కీలక సేవలు అందించారు. ఆయన నేతృత్వంలోనే భారత్ అణ్వాయుధ సామర్థ్యం గల క్షిపణులను దేశీయంగా అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని ప్రదర్శించింది.
ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఆయనకు 1990లో పద్మశ్రీ, 2000లో పద్మభూషణ్ తో డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ ను సత్కరించింది. అంతక ముందు డీఆర్డీవో టెక్నాలజీ లీడర్ షిప్ అవార్డ్, చంద్రశేఖర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ అవార్డులను ఆయన అందుకున్నారు.