రాజకీయంగా రామోజీని ఇబ్బంది పెట్టారు.. పవన్ సంచలన వ్యాఖ్యలు!
రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు మృతిపట్ల దేశవ్యాప్తంగా పలువురు సంతాపం తెలియజేసిన సంగతి తెలిసిందే
రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు మృతిపట్ల దేశవ్యాప్తంగా పలువురు సంతాపం తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు అవకాశం ఉన్న ప్రతీ ఒక్క ప్రముఖుడు రామోజీ పార్థివదేహానికి నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో రామోజీ మరణవార్త తెలిసే సమయానికి ఢిల్లీలో ఉన్న చంద్రబాబు.. సతీసమేతంగా వచ్చి ఆయనకు నివాళులర్పించారు!
ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడ నుంచి ఆర్.ఎఫ్.సీ.కి చేరుకుని రామోజీ పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామోజీరావుపై సుమారు గత దశాబ్ధన్నర కాలంగా ఈ ప్రభుత్వాలు ఆయనను ఎంతో ఇబ్బంది పెట్టాయని.. అయితే ఆ ప్రభుత్వాలు ఇప్పుడు లేవని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... రామోజీరావు మరణవార్త విని తాను చాలా దిగ్భ్రాంతికి గురైనట్లు చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... ప్రమాణస్వీకారం తర్వాత వచ్చి ఆయనను కలుద్దామనుకున్నట్లు తెలిపారు. అయితే... ఇంతలోనే దురదృష్టవశాత్తు ఆయన కన్నుమూశారని అన్నారు. ఈ సందర్భంగా ఈనాడు జర్నలిజం స్కూలు గొప్పతనం గురించి పవన్ కల్యాణ్ స్పందించారు.
ఇందులో భాగంగా... నేడు ఎంతోమంది జర్నలిస్టులను అందించిన మహానుభావులు రామొజీరావు అని చెప్పిన పవన్... వారంతా ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చినవారే అని తెలిపారు. ఇదే సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమకు రామోజీ ఎంతో చేశారని.. అత్యున్నత ప్రమాణాలతో గొప్ప ఫిల్మ్ సిటీని నిర్మించారని కొనియాడారు.
ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు అండగా ఉండాలని.. జనసేన తరుపున సంతాపం తెలియజేస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు నిర్మాత రాధాకృష్ణ (చినబాబు), దర్శకుడు త్రిమిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారు.