రాజధాని "అమరావతి" క్రెడిట్ రామోజీరావుదే!

అయితే రాజధానికి ఏ పేరు పెట్టాలనే విషయంపై తీవ్ర చర్చలు జరిగిన సంగతి తెలిసిందే.

Update: 2024-06-08 08:16 GMT

2014లో రాష్ట్ర విభజన అనంతరం విభజిత ఆంధ్రప్రదేశ్.. రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో విజయవాడ - గుంటూరు ప్రాంతంలో ఏపీ రాజధాని నిర్మాణం చేపట్టే అవకాశం ఉందని కథనాలొచ్చాయి. అనంతరం ఆ నిర్ణయం ఫైనల్ అయ్యింది. అయితే రాజధానికి ఏ పేరు పెట్టాలనే విషయంపై తీవ్ర చర్చలు జరిగిన సంగతి తెలిసిందే.

అయితే... ఆఖరికి నాడు ఏపీ రాజధానికి "అమరావతి" అని నామకరణం చేశారు చంద్రబాబు. ఈ క్రమంలో తాజాగా ఆ పేరు పెట్టడం వెనకున్న అసలు విషయాని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను మరోసారి "ఎక్స్"లో పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా నాడు రాజధానికి ఏ పేరు పెట్టాలి అని ఆలోచనలు చేస్తున్నప్పుడు రామోజీరావే ఈ సలహా ఇచ్చారని చంద్రబాబు తెలిపారు.

ఇందులో భాగంగా... "ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఏ పేరు పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తుంటే.. రామోజీరావు గారు పరిశోధన చేసి, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పేరు బాగుంటుంది అని చెప్తే.. అందరి అభిప్రాయం తీసుకుని, అమరావతి అని రాజధాని పేరు పెట్టుకున్నా" అని రామోజీరావు గురించి, గతంలో చంద్రబాబు గారు చెప్పిన మాటలు ఇవి అంటూ ఒక వీడియో మరోసారి తెరపైకి వచ్చింది.

అంతక ముందు రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా... ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, అసామాన్య విజయాలు సాధించారని కొనియాడారు. అలాంటి రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని చంద్రబాబు అన్నారు. ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని తాను అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రామోజీరావుతో తన 4 దశాబ్ధాల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు చంద్రబాబు. ఈ క్రమంలోనే మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు, తనను ఆయనకు ఎంతో దగ్గర చేసిందని అన్నారు. సమస్యలపై పోరాడటంలో ఆయన తనకు ఒక స్పూర్తి అని చంద్రబాబు కొనియాడారు. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో తాను రామోజీ సూచనలు, సలహాలు తిసుకునేవాడినని గుర్తుచేసుకున్నారు.

Tags:    

Similar News