ఎన్టీఆర్‌ ను సీఎంను చేయడంలో రామోజీదే కీలక పాత్ర!

తెలుగు మీడియా మొగల్‌ గా పేరుగాంచిన రామోజీరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే

Update: 2024-06-08 12:34 GMT

తెలుగు మీడియా మొగల్‌ గా పేరుగాంచిన రామోజీరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. వ్యాపార, ఆతిథ్య, వినోద రంగాల్లో రామోజీరావు విశేషంగా రాణించారు. అంతేకాకుండా తెలుగునాట అనేక రాజకీయ పరిణామాల్లో తన పత్రిక ‘ఈనాడు’ ద్వారా కీలక పాత్ర పోషించారు. విపుల, చతుర, తెలుగు వెలుగు, బాలభారతం తదితర మ్యాగజైన్ల ద్వారా తెలుగు భాషకు పెద్దపీట వేశారు. తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేశారు. అన్నదాత మ్యాగజైన్‌ ద్వారా రైతులకు విలువైన సమాచారాన్ని అందించారు. సితార పత్రిక ద్వారా సినీ అభిమానులను ఆకట్టుకున్నారు.

ఇదంత ఒకత్తయితే ముఖ్యంగా 1983లో విఖ్యాత నటుడు ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు రామోజీరావు తన ఈనాడు పత్రికలో ఆ పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్‌ రాష్ట్రవ్యాప్తంగా చైతన్య రథంపైన ప్రయాణించారు.

ఈ క్రమంలో ఎన్టీఆర్‌ బస చేసిన చోట ఆగడం, ఆరు బయటే దంతధావనం చేసుకోవడం, స్నానపానాదులు, అల్పాహారం తీసుకోవడం, భోజనం చేయడం, దారిలో చిన్నారులను ముద్దు చేయడం వంటి ఫొటోలను కూడా ఈనాడు పత్రికలో ప్రచురించేవారు.

ఈ ఫొటోల కోసం నాడు ప్రజలంతా ఈనాడు పత్రికపైనే ఆధారపడేవారు. అప్పట్లో టీవీ చానెళ్లు లేకపోవడంతో ఈనాడు పత్రిక కోసం ఆవురావురుమంటూ ఎదురుచూసేవారు. ఎన్టీఆర్, రామోజీరావు ఇద్దరిదీ కృష్ణా జిల్లానే కావడం విశేషం. నాడు ఈనాడు పత్రికలో ఎన్టీఆర్‌ కు, టీడీపీకి పెద్ద ఎత్తున ప్రాధాన్యం లభించేది.

ఎన్టీఆర్‌ ను సామాన్యుల మనిషిగా, బడుగు, బలహీనవర్గాల సంరక్షకుడిగా చూపడంలో ఈనాడు పత్రిక సక్సెస్‌ అయ్యింది. మరోవైపు ఈనాడు సర్క్యులేషన్‌ కూడా భారీగా పెరిగింది. నాడు అగ్రస్థానంలో ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి తదితర దినపత్రికలను ఈనాడు తన సర్క్యులేషన్‌ తో క్రాస్‌ చేసింది. సినీ నటుడిగా ఎన్టీఆర్‌ కు ఉన్న విశేష ఖ్యాతి, రామోజీరావు ఈనాడు ప్రచారం అండతో 1983లో ఎన్టీఆర్‌ విజయదుందుభి మోగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు.

ఇక 1995లో నాడు మారిన రాజకీయ పరిస్థితుల్లోనూ రామోజీరావు కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్‌ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. 1999 ఎన్నికల్లో రెండోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించడంలోనూ రామోజీదే కీలక పాత్ర అని అంటారు.

కాగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రామోజీరావుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వైఎస్సార్‌ తరచూ ‘‘ఆ రెండు పత్రికలు’’ అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిపైన నిప్పులు చెరిగేవారు. వైఎస్సార్‌ హయాంలో రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ సంస్థలపైనా ప్రభుత్వం కేసులు కూడా నమోదు చేసింది. ఆ తర్వాత జగన్‌ అధికారంలోకి వచ్చాక తన తండ్రిలానే రామోజీతో పోరాటం సాగించారు. మార్గదర్శి వ్యవహారంలో ఏపీ సీఐడీ అధికారులు రామోజీరావు, ఆయన కోడలు శైలజపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులను ఆయన గుండె నిబ్బరంతో ఎదుర్కొన్నారు. విచారణకు సహకరించారు. ఈ క్రమంలో సీఐడీ అధికారులు రామోజీ నివాసానికి వెళ్లి ఆయనను విచారించారు.

Tags:    

Similar News