రన్యారావు బంగారం స్మగ్లింగ్ లో.. అతడే ‘కీ’ పిన్
దేశ వ్యాప్తంగా సంచలనాన్ని రేపిన నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసుకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రిమాండ్ రిపోర్టు బయటకు వచ్చింది.;

దేశ వ్యాప్తంగా సంచలనాన్ని రేపిన నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసుకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రిమాండ్ రిపోర్టు బయటకు వచ్చింది. ఇందులో పలు కీలక అంశాల్ని ప్రస్తావించారు. రన్యారావు స్మగ్లింగ్ వెనుక ఉన్న కీలకపాత్ర ఎవరిదన్న విషయాన్ని ఈ రిపోర్టు వెల్లడించింది. ఆభరణాల వ్యాపారి సాహిల్ సకారియా జైన్ కీలకంగా వ్యవహరించిట్లుగా గుర్తించారు.
దాదాపు 49.6 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలించటంతో పాటు రూ.40 కోట్ల మేర నగదును హవాలా పద్దతిలో తరలించిన వైనంలోనూ సాహిల్ కీలక పాత్ర పోషించినట్లుగా గుర్తించారు. దుబాయ్ కు దాదాపు రూ.38 కోట్లు.. రన్యాకు రూ.1.73 కోట్ల హవాలా డబ్బును బదిలీ చేసిన వైనాన్ని ఈ రిపోర్టులో వెల్లడించారు. మార్చి నాలుగున రన్యారావు ఇంట్లో దొరికిన రూ.2.67 కోట్ల నగదుకు సంబంధించిన వివరాల్ని పేర్కొన్నారు.
దుబాయ్ లో బంగారాన్ని కొని.. బెంగళూరులో అమ్మటం ద్వారా ఆమెకు వచ్చిన లాభంగా హవాలా డబ్బులు అందుకున్నట్లుగా గుర్తించారు. ప్రతి లావాదేవీకి రూ.55 వేల కమిషన్ అందుకున్న విషయాన్ని సాహిల్ పేర్కొన్నారు. రన్యారావు బంగారు స్మగ్లింగ్ కేసులో సాహిల్ ఏ3గా ఉన్న విషయం తెలిసిందే. రిపోర్టులో పేర్కొన్న దాని ప్రకారం సాహిల్.. ఈ ఏడాది జనవరిలో 14.56 కేజీల బంగారాన్ని.. రూ.11.56 కోట్ల మొత్తాన్ని హవాలా రూపంలో తరలించారు. ఇందులో రూ.11 కోట్ల మొత్తాన్ని దుబాయ్ కు.. రన్యారావుకు రూ.55 లక్షలు బదిలీ చేసినట్లుగా పేరకొన్నారు.
సాహిల్ కు చెందిన రెండు సెల్ ఫోన్లు.. ల్యాప్ టాప్ నుంచి సేకరించిన సమాచారాన్ని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రన్యారావు స్మగ్లింగ్ కేసులో అతడి పాత్ర కీలకమన్న విషయాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ పేర్కొంది. దుబాయ్ నుంచి బెంగళూరుకు ప్రత్యేక కాస్ట్యూమ్ తో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న రన్యారావును.. ఈ ఏడాది మార్చిలో అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. తనిఖీల్లో ఆమె వద్ద 14.7 కేజీల బంగారాన్ని గుర్తించటంతో ఆమెను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. ఇప్పటికే ఆమె పెట్టుకున్న బెయిల్ అప్పీల్ ను కోర్టు తిరస్కరించటం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన రన్యారావు ఉదంతం ద్వారా దేశంలోకి అక్రమంగా వస్తున్న బంగారం వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.