హవాలా డబ్బుతో బంగారం కొనుగోళ్లా? రన్యారావు కేసులో తవ్వే కొద్దీ సంచలనాలు

ఈ విషయాన్ని రన్యా రావు స్వయంగా అంగీకరించారని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.;

Update: 2025-03-25 20:30 GMT

దుబాయ్ నుండి అక్రమంగా బంగారం తరలిస్తూ బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టయిన కన్నడ నటి రన్యా రావు కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఆమె విదేశంలో బంగారం కొనుగోలు చేసేందుకు హవాలా డబ్బును ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషయాన్ని రన్యా రావు స్వయంగా అంగీకరించారని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతుండగా, డీఆర్‌ఐ తమ దర్యాప్తులో వెల్లడైన విషయాలను న్యాయస్థానానికి తెలియజేసింది. బంగారం కొనుగోలు కోసం హవాలా మార్గాల ద్వారా నగదు బదిలీ చేసినట్లు రన్యా రావు అంగీకరించారని డీఆర్‌ఐ స్పష్టం చేసింది.

కాగా మార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ రన్యా రావు అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమెకు మరో నిందితుడు తరుణ్ రాజ్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. రన్యా రావు పంపిన డబ్బుతోనే తరుణ్ రాజ్ దుబాయ్ నుండి హైదరాబాద్ వెళ్లాడని అధికారులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా వీరు బ్యాంకాక్, జెనీవాకు కూడా బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేవారని పేర్కొన్నారు.

హోటల్ వ్యాపారి అయిన తరుణ్ రాజ్, రన్యా రావు స్నేహితులని, వీరిద్దరూ కలిసి 2023లో దుబాయ్‌లో విరా డైమండ్స్ ట్రేడింగ్ ఎల్‌ఎల్‌సీ (LLC) అనే ట్రేడింగ్ కంపెనీని స్థాపించారని దర్యాప్తులో తేలింది. వారు వ్యాపార భాగస్వాములుగా కొనసాగుతూ ఈ కంపెనీని నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు.

ఈ స్మగ్లింగ్ కేసులో రోజురోజుకూ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా రన్యా రావు హవాలా మార్గాల ద్వారా నగదు చెల్లించి బంగారం కొనుగోలు చేసినట్లు డీఆర్‌ఐ అధికారులు ఆరోపించడంతో ఈ కేసు మరింత సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.

కన్నడ నటి రన్యారావు ఈనెల 3న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.12 కోట్లకు పైగా విలువైన బంగారంతో పట్టుబడిన ఆమె వ్యవహారంలో అనేక విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డీఆర్ఐ అధికారులు జరిపిన సోదాల్లో ఆమె నివాసంలో మరో రూ.3 కోట్ల విలువైన నగలు, నగదు లభ్యమయ్యాయి. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న అధికారులు లోతుగా దర్యాప్తు చేయగా, విమానాశ్రయంలోని భద్రతా లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి. కేంద్ర, రాష్ట్ర అధికారుల బృందం విమానాశ్రయాన్ని పరిశీలించిన అనంతరం అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు ఏమాత్రం సరిగా లేవని తేల్చారు. కస్టమ్స్ ప్రాంతంలోకి ప్రవేశించే ముందు ఉండాల్సిన డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు (DFMD) అక్కడ లేకపోవడం అధికారులను షాక్‌కు గురిచేసింది. ఇది అత్యంత పెద్ద భద్రతా వైఫల్యంగా వారు అభివర్ణించారు.

కేవలం డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లే కాదు, ప్రయాణికుల హ్యాండ్ బ్యాగేజీ , శరీరాన్ని స్కాన్ చేసే మెటల్ డిటెక్టర్లు కూడా కనిపించలేదని రాష్ట్ర పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాకుండా విమానాశ్రయంలో నిఘా వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే ఉందని, తనిఖీలు కూడా నామమాత్రంగానే జరుగుతున్నాయని గుర్తించారు. మెటల్ డిటెక్టర్లు లేకపోవడం వల్లే రన్యారావు ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రతా తనిఖీల నుంచి తప్పించుకోగలిగిందని అధికారులు భావిస్తున్నారు.

Tags:    

Similar News