రాపాక సైకిలెక్కబోతున్నారా ?

రాపాక వర ప్రసాదరావు కేరాఫ్ రాజోలు. ఈ పేరు మారుమోగింది అచ్చంగా 2019 ఎన్నికల ఫలితాల తరువాతనే.

Update: 2024-10-14 03:41 GMT

రాపాక వర ప్రసాదరావు కేరాఫ్ రాజోలు. ఈ పేరు మారుమోగింది అచ్చంగా 2019 ఎన్నికల ఫలితాల తరువాతనే. ఎందుకంటే జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన. ఆనాడు అధినేత పవన్ రెండు సీట్లలో ఓడిపోతే రాపాక మాత్రమే జనసేన నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

అయితే రాపాక రూపంలో జనసేనకు దక్కిన ఆనందం తొందరలోనే ఆవిరి అయిపోయింది. ఆయన అధికార వైసీపీ కూటమికి దగ్గర కావడంతో పాటు గెలుపు తన ఘనతే అన్నట్లుగా ఫీల్ అయ్యారని చెప్పుకునేవారు. ఇక వైసీపీ అధికార ఎమ్మెల్యేగా కూడా ఆయన చలామణీ అయ్యారు.

ఈ క్రమంలో వైసీపీ కూడా ఆయనను ప్రోత్సహించింది. ఒకరి అవసరాలు మరొకరు తీర్చుకున్నట్లుగా రాజోలు రాజకీయం సాగింది. తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి రాజోలు టికెట్ ని మాజీ మంత్రి టీడీపీ నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకు ఇచ్చేశారు అమలాపురం నుంచి ఎంపీగా రాపాకను పోటీ చేయించారు.

ఆయన దీని మీద హర్ట్ అయ్యారని అప్పట్లో అనుకున్నారు. ఆ హర్ట్ ఇప్పటికి ఇలా బ్రేక్ అయి బయటకు వచ్చింది వైసీపీకి రాజీనామా అంటూ రాపాక రాగం అందుకున్నారు. వైసీపీలో తాము ఇమడలేకపోతున్నాను అన్నారు. తన ప్లేస్ లోకి సూర్యారావుని తెచ్చారని ఈ రోజుకు కూడా రాజోలు ఇంచార్జి ఆయనే అని కూడా ఆయన చెప్పారు.

తాను పార్టీకి ప్రాణం పెట్టి పనిచేస్తే పార్టీ తనను పక్కన పెట్టి తీరని అన్యాయమే చేసింది అని అన్నారు. మొత్తానికి పార్టీని వీడుతున్నట్లుగా చల్లని కబురు అయిఏ చెప్పారు. తాను చేరే పార్టీ పేరు ఆయన రివీల్ చేయలేదు కానీ త్వరలోనే మరో పార్టీలో కనిపిస్తాను అని హింట్ ఇచ్చారు. రాజోలు లో సూర్యారావు వైసీపీలోకి వచ్చారు. ఆయన టీడీపీ నుంచి అలా షిఫ్ట్ అయ్యారు. ఇక ఇపుడు రాపాకను ఉన్న ఆప్షన్ టీడీపీయే అంటున్నారు

ఆయన ఎటూ జనసేనలోకి పోలేరు. ఏకంగా అధినేత పవన్ కళ్యాణ్ నే విమర్శించాక అక్కడ ఆయనకు చాన్స్ లేదని అంటున్నారు. అయితే రాపాక టీడీపీ ప్రవేశం అంత ఈజీగా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎందుకు అంటే రాపాక టీడీపీలో చేరితే అక్కడ బలంగా ఉన్న జనసేనతో మిత్ర బంధం స్టార్ట్ అవుతుంది.

పైగా ఒకనాడు జనసేనను వంచించారు అని ఆ పార్టీకి ఆగ్రహం ఉంది. ఇపుడు తమను కాదని టీడీపీలోకి రాపాక వెళ్తే మాత్రం జనసేన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలని అంటున్నారు. అయితే ఎవరెటు వెళ్తే తమకేంటి అని జనసేన అనుకుంటే మాత్రం రాపాక సైకిలెక్కేసినట్లే. మొత్తానికి రాపాక 2009లో తొలిసారి కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2019లో జనసేన నుంచి గెలిచారు. ఆ మీదట వైసీపీ, ఇపుడు టీడీపీ అంటూ పార్టీ మారితే మాత్రం ఆయనకు రాజోలులో పట్టు దొరుకుతుందా ఆయన అనుకున్న గమ్యం చేరగలరా అన్నది కాలమే చెప్పాల్సి ఉంది.

Tags:    

Similar News