అమలాపురం ఎంపీగా రాపాక...అనూరాధకు నో చాన్స్...!
ఇక మరోసారి ఆయన రాజోలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని అంతా అనుకున్నారు. ఇపుడు ఆయనను అమలాపురం నుంచి ఎంపీగా పంపుతున్నారు.
అమలాపురం నుంచి ఎంపీగా జనసేన జంపింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు వైసీపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆయన 2019లో రాజోలు నుంచి జనసేన తరఫున గెలిచారు. ఆ తరువాత ఆయన వైసీపీ వైపు జంప్ అయ్యారు. అయిదేళ్ల పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగారు.
ఇక మరోసారి ఆయన రాజోలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని అంతా అనుకున్నారు. ఇపుడు ఆయనను అమలాపురం నుంచి ఎంపీగా పంపుతున్నారు. ఇదే విషయం రెండు రోజుల క్రితం స్థానికంగా జరిగిన వైసీపీ పార్టీ మీటింగులోనే రాపాక చెప్పేశారు. ఆయనకు అప్పటికే ఈ మ్యాటర్ తెలుసు.
ఆయన సిట్టింగ్ ఎంపీ అనూరధ ఉండగానే ఈ మాట అనడంతో ఆమె వర్గీయులు కలవరం చెందారు. రీజనల్ కో ఆర్డినేటర్ మిధున్ రెడ్డి హై కమాండ్ నిర్ణయం ప్రకటిస్తుంది అని సర్ది చెప్పారు. అయితే వైసీపీ శుక్రవారం రాత్రి పొద్దుపోయాక విడుదల చేసిన పదవ జాబితాలో అమలాపురం ఎంపీ సీటుకి ఇంచార్జిగా రాపాకను ప్రకటించారు.
ఆయన ఎమ్మెల్యేగా ఉన్న రాజోలుని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు కేటాయించారు. సూర్యారావు ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారు. అక్కడ సీటుని జనసేనకు ఇస్తూండడంతో ఆయన పార్టీ మారారు. రాజోలు అసెంబ్లీ సీటు విషయంలో హామీ తీసుకునే సూర్యారావు వైసీపీ కండువా కప్పుకున్నారు అని అంటున్నారు.
ఇక కర్నూల్ పార్లమెంట్ కి ఇంచార్జిగా వీవై రామయ్యను నియమించారు. ఆయన వచ్చే ఎన్నికల్లో కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు అని తెలుస్తోంది. ఇలా మూడు సీట్లకు వైసీపీ పదవ జాబితాలో చోటు కల్పించారు. మిగిలిన సీట్ల విషయం ఎలా ఉన్నా అమలాపురం సిట్టింగ్ ఎంపీ చింతా అనూరాధకు ఎక్కడ సీటు ఇస్తారు అన్నది చర్చగా ఉంది. ఆమెకు ఈసారి నో చాన్స్ అంటే ఆమె ఏ రకంగా వ్యవహరిస్తారు, ఆమె డెసిషన్ ఏంటి అన్నది కూడా వైసీపీలో చర్చ సాగుతోంది.
ఇవన్నీ పక్కన పెడితే రాపాక మాత్రం జాక్ పాట్ కొట్టారు. ఆయన వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా ఉంటూ ఎంపీగా ప్రమోషన్ అందుకున్నారు అని అంటున్నారు.