ఐఏఎస్ బదిలీల్లో రేర్ సీన్.. రేవంత్ వ్యూహమేంటి?

ఇలాంటి ప్రయోగాలు చేయటం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను స్టీరియో టైప్ రాజకీయాలకు పరిమితం కాదన్న విషయాన్ని ఫ్రూవ్ చేసినట్లుగా చెబుతున్నారు.

Update: 2024-06-25 05:38 GMT

పాలనను ప్రక్షాళన చేసేందుకు వీలుగా ఒకేసారి 40 మంది ఐఏఎస్ లు.. ఇద్దరు ఐపీఎస్ లు.. ఒక ఐఎఫ్ఎస్ .. మరో నాన్ క్యాడర్ అధికారిని బదిలీ చేయటం తెలిసిందే. తాజాగా చేసిన బదిలీల మొత్తంలో ఒక ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. సమకాలీన రాజకీయాల్లో ఇలాంటి సీన్ చూసి ఉండమన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అదేమంటే.. కేసీఆర్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరించిన హరీశ్ రావు వద్ద ఓఎస్ డీగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి అశోక్ రెడ్డి ప్రస్తుతం ఉద్యానవన శాఖ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

ఆయన్ను తీసుకెళ్లి కీలకమైన వాటర్ బోర్డు ఎండీగా బాధ్యతలు అప్పజెప్పారు. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ఒక ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిని అప్రాధాన్యత పోస్టులకు పరిమితం చేయటం చూస్తుంటాం. అందుకు భిన్నంగా హరీశ్ రావుకు ఓఎస్డీగా వ్యవహరించిన అధికారిని తీసుకొని.. ప్రభుత్వంలో కీలకమైన వాటర్ బోర్డుకు ఎండీగా బాధ్యతల్ని అప్పగించటం చాలామందిని విస్మయానికి గురి చేసింది.

ఇలాంటి ప్రయోగాలు చేయటం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను స్టీరియో టైప్ రాజకీయాలకు పరిమితం కాదన్న విషయాన్ని ఫ్రూవ్ చేసినట్లుగా చెబుతున్నారు. హరీశ్ రావుకు అత్యంత ముఖ్య అధికారిగా వ్యవహరించినప్పటికీ.. పని విషయంలోనూ.. సమర్థత విషయంలోనూ అశోక్ రెడ్డిని వంక పెట్టలేమని చెబుతున్నారు. ముక్కుసూటిగా పని చేసుకుంటూ పోయే ఆయనపై ఆరోపణలు కూడా పెద్దగా వినిపించవు. మంచిగా పని చేస్తారన్న పేరున్న ఆయనకు.. సమర్థత.. సామర్థ్యానికి తగ్గట్లుగా పోస్టు ఇవ్వటం చూసిన వైనం ఆసక్తికరంగా మారింది.

గత ప్రభుత్వంలో కీలక నేతలకు సన్నిహితంగా ఉండే అధికారులపై వేటు వేయటం.. అప్రాధాన్యత పోస్టులకు పరిమితం చేయటం లాంటివి చేయకుండా.. వారి టాలెంట్ ను ప్రభుత్వ రథాన్ని ముందుకు తీసుకెళ్లటంలో ఉపయోగించుకుంటామన్న సంకేతం తాజా బదిలీతో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా ఇదో రేర్ సీన్ గా అభివర్ణిస్తున్న వారు లేకపోలేదు.

ఇప్పటి రాజకీయ వాతావరణంలో ఈ తరహా నిర్ణయం ఆసక్తికర చర్చకు తెర తీసింది. ఇతర బదిలీల్లో కీలక అంశాల్ని చూస్తే.. సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియాకు ప్రభుత్వం భారీ ప్రాధాన్యతను ఇచ్చింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఆయనకే ప్లానింగ్.. పంచాయితీరాజ్.. గ్రామీణాభివ్రద్ధి శాఖలు అప్పజెప్పింది. హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ జాయింట్ కమిషన్ గా వ్యవహరిస్తున్న అమ్రపాలికి జీహెచ్ఎంసీ కమిషనర్ గా పూర్తి అదనపు బాధ్యతల్ని అప్పజెప్పింది. ఇప్పటికే ఆమె ఐదు కీలక బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News