ఈ క్రికెటర్ కు ఉన్న ఆలోచనలో సగం కూడా ప్రభుత్వానికి లేదా?
ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల పాలనలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ వారు తీసుకుంటున్న నిర్ణయాలు మహిళల ప్రాథమిక హక్కులకు తీవ్ర భంగం కలిగిస్తున్నాయి
ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల పాలనలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ వారు తీసుకుంటున్న నిర్ణయాలు మహిళల ప్రాథమిక హక్కులకు తీవ్ర భంగం కలిగిస్తున్నాయి. అసలు వారికి జీవించే హక్కు మినహా మిగిలిన ప్రాథమిక హక్కులు ఏమీ లేవన్నట్లుగా ఉందనే చర్చా తెరపైకి వస్తుంటుంది. ఈ సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు తాలిబన్లు.
ఇందులో భాగంగా.. ఆఫ్ఘనిస్తాన్ లో మహిళల కోసం విద్యా, వైద్య సంస్థలను మూసివేయాలని నిర్ణయంచింది! దీనిపై ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ స్పందించారు. ఈ నిర్ణయంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ముఖ్యంగా... నర్సింగ్ ఇనిస్టిట్యూట్ లలో మహిళలు తరగతులకు హాజరుకాకుండా నిషేధించబడతారనే ప్రకటనపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.
వైద్య, పారా మెడికల్ సిబ్బంది కొరతతో బాధపడుతున్న దేశంలో ఈ చర్య భారీగా ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన రషీద్... ఈ సందర్భంగా ఇస్లామిక్ బోధనలలో విద్య ప్రాముక్యతను హైలెట్ చేస్తూ కీలక పోస్ట్ పెట్టారు. తాలిబన్ల నిర్ణయం పట్ల విచారం వ్యక్తం చేశాడు.
ఈ సందర్భంగా... ఇస్లామిక్ బోధనలలో విద్యకు ప్రధాన స్థానం ఉందని.. ఇది పురుషులు, మహిళలు ఇద్దరికీ జ్ఞాన సాధనను నొక్కి చెబుతుందని అన్నారు. ఇదే క్రమంలో... ఆఫ్ఘనిస్తాన్ సోదరీమణులు, తల్లుల కోసం ఇటీవల విద్యా, వైద్య సంస్థల మూసివేత గురించి తాను తీవ్ర విచారం, నిరాశతో ఉన్నట్లు తెలిపారు.
ఈ నిర్ణయం వారి భవిష్యత్తును మాత్రమే కాకుండా మన సమాజ విస్తృత నిర్మాణాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని.. సోషల్ మీడియా ద్వారా వారు వ్యక్తపరిచే బాధ, వారు ఎదుర్కొనే పోరాటాలకు పదునైన రిమైండర్ గా పనిచేస్తాయని రషీద్ పోస్ట్ లో రాశారు. తమ దేశం కోసం ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు.
తద్వారా ఆఫ్ఘనిస్తాన్ బాలికలు తమ విద్యాహక్కును తిరిగి పొందగలరని.. ఫలితంగా దేశాభివృద్ధికి తోడ్పడగలరని రషీద్ తెలిపారు. అందరికీ విద్యను అందించడం అనేది కేవలం సామాజిక బాధ్యత మాత్రమే కాదని.. మన విశ్వాసం, విలువలలో లోతుగా పాతుకుపోయిన నైతిక బాధ్యత అని రషీద్ అన్నారు.