నాలుగు కాళ్ల స్నేహితుల కోసం... రతన్ టాటా నిబద్ధతకు ఇదే నిదర్శనం!

టాటా సామ్రాజ్యానికి ప్రధాన కార్యాలయం అయిన ముంబైలోని బాంబే హౌస్ లోని ప్రత్యేక ఆశ్రయంలో ఇతర కుక్కలతో పాటే గోవా కూడా పెరిగింది.

Update: 2024-10-14 17:30 GMT

దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు జంతువుల పట్ల.. ప్రధానంగా వీధి కుక్కల పట్ల ఎంతో ప్రేమ, కరుణ ఉండేవనే సంగతి తెలిసిందే. ఇక పెంపుడు శునకం "గోవా".. ఇటీవల రతన్ టాటా కడసారి చూపుకోసం వచ్చినప్పటి వీడియో హృదయాలను కదిలించిన పరిస్థితి. రతన్ టాటాతో గోవాకు సుమారు 11 ఏళ్ల అనుబంధం.

రతన్ జీ గోవా వెళ్లినప్పుడు తనను అనుసరించిన ఆ వీధి శునకాన్ని పెంచుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. తన సెక్యూరిటీతో ఆ శునకాన్ని గోవా నుంచి ముంబైకి రప్పించారు. టాటా సామ్రాజ్యానికి ప్రధాన కార్యాలయం అయిన ముంబైలోని బాంబే హౌస్ లోని ప్రత్యేక ఆశ్రయంలో ఇతర కుక్కలతో పాటే గోవా కూడా పెరిగింది.

ఇక వర్షాకాలం వచ్చిందంటే... వాహనదారులకు రతన్ టాటా చేసే రిక్వస్ట్ దాదాపు అందరికీ తెలిసిందే. వర్షాకాలంలో కార్ల కింద వీధి శునకాలు, పిల్లులు వంటివి తల దాచుకుంటాయని.. అందువల్ల కారు స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి దాని కింద చెక్ చేసుకోవాలని చెప్పేవారు. అలాకానిపక్షంలో.. అవి గాయపడటమో, చనిపోవడమో జరుగుతుందని వివరించేవారు.

ఇక అడుగడుగునా రాజరికం ఉట్టిపడే తాజ్ హోటల్ వెలుపల ప్రవేశ ద్వారం పక్కన ఓ వీధి శునకం నిద్రపోవడానికి సంబంధించిన ఫోటోలు గతంలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీధి శునకాలు, పెంపుడు జంతువుల పట్ల ఆయనకున్న నిబద్ధతకు అద్దంపట్టేలా నిలబడింది ఆయన కట్టించిన యానిమల్ హాస్పటల్.

అవును... చాలా మంది చెప్పే మాటలకూ చేసే పనులకూ ఏమాత్రం పొంతన ఉండదని అంటుంటారు. అయితే... రతన్ జీ మాత్రం తాను ఏది ఆచరించేవారో అదే ఇతరులకూ చెప్పే ప్రయత్నం చేసేవారు. తన మాటలను చేతల్లో స్పష్టంగా చూపించేవారు. కేవలం అతని వ్యాపార చతురత కోసమే కాకుండా... జంతువుల పట్ల ఆయనకున్న ప్రగాఢ కరుణ కోసం కూడా పరితపించేవారు.

ఇందులో భాగంగా... ముంబైలోని మహాలక్ష్మీ ప్రాంతంలో టాటా ట్రస్ట్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ ను ఈ ఏడాది జూలై ఒకటో తేదీన ప్రారంభించారు. సుమారు రూ.165 కోట్ల తో అత్యాధినిక సదుపాయాలతో 200 పడకలు, 24*7*365 అత్యవసర సంరక్షణను కలిగి ఉంది. ఇది పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణలో కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది.

దీంతో... తన నాలుగు కాళ్ల స్నేహితుల కోసం రతన్ టాటా నిబద్ధతకు ఈ హాస్పటల్ ఓ చిన్న నిదర్శనం అని అంటున్నారు! ఆయన కమిట్మెంట్ ని కొనియాడుతున్నారు!

Tags:    

Similar News