వంటమనిషికి కోటి.. రతన్ టాటా వీలునామాలో సంచలనాలు

తన జీవితంలో ఎంతోకాలం పాటు తనకు వంట చేసి పెట్టిన వ్యక్తికి రతన్ టాటా ఏకంగా కోటి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించడం విశేషం.;

Update: 2025-04-02 06:15 GMT
వంటమనిషికి కోటి.. రతన్ టాటా వీలునామాలో సంచలనాలు

దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తన వీలునామా ద్వారా చూపిన మానవత్వం అందరినీ కదిలిస్తోంది. ఆయన సంకల్పానికి సంబంధించిన మరిన్ని వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. తన జీవితంలో ఎంతోకాలం పాటు తనకు వంట చేసి పెట్టిన వ్యక్తికి రతన్ టాటా ఏకంగా కోటి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించడం విశేషం.

రతన్ టాటా తన వీలునామాలో తన సిబ్బంది పట్ల చూపిన అభిమానం, కృతజ్ఞత అమోఘం. ఆయన తన కుక్ రజన్ షాకు ఒక కోటి రూపాయలు ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే, ఇంటి పనులు చూసుకునే సుబ్బయ్యకు రూ. 66 లక్షలు, తన సెక్రటరీ డెల్నాజ్కు రూ. 10 లక్షలు ఇవ్వాలని తెలిపారు.

ఇక తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకు తాను ఇచ్చిన ఒక కోటి రూపాయల రుణాన్ని కూడా రతన్ టాటా మాఫీ చేశారు. శంతను నాయుడుతో ఆయనకు ఉన్న అనుబంధానికి ఇది నిదర్శనం.

వందల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన రతన్ టాటా తన సంపదలో అత్యధిక భాగాన్ని మంచి పనుల కోసం కేటాయించారు. ఆయనకు దాదాపు రూ. 10 వేల కోట్ల ఆస్తులు ఉండగా, అందులో రూ. 3800 కోట్లను దానధర్మాల కోసం విడిచిపెట్టారు.

టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా తన వీలునామా ద్వారా తన ఆస్తులను ఎవరికి కేటాయించారో స్పష్టం చేశారు. 2022 ఫిబ్రవరి 23న రాసిన ఈ వీలునామా ప్రకారం, టాటా సన్స్‌లోని తన వాటాలను విక్రయించాల్సి వస్తే, మొదటగా ఆ సంస్థలోని ప్రస్తుత వాటాదారులకే విక్రయించాలని ఆయన పేర్కొన్నారు.

ఇక, ఆయన ఇతర ఆస్తుల విషయానికి వస్తే, తన సవతి సోదరీమణులు శిరీన్ జజీభోయ్, దియానా జజీభోయ్‌లకు రూ.800 కోట్ల విలువైన ఆస్తులను రాశారు. ఇందులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్టాక్స్‌తో పాటు విలువైన వాచ్‌లు, పెయింటింగ్స్ ఉన్నాయి. అలాగే, రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడైన టాటా గ్రూప్ మాజీ ఉద్యోగి మోహిన్ ఎం దత్తాకు కూడా రూ.800 కోట్ల విలువైన ఆస్తులు దక్కాయి.

తన సోదరుడు జిమ్మీ నావల్ టాటాకు ముంబైలోని జుహూలో ఉన్న బంగ్లాలో వాటాతో పాటు కొన్ని వెండి వస్తువులు, బంగారు ఆభరణాలను కేటాయించారు. అలీబాగ్‌లోని బంగ్లాతో పాటు మూడు పిస్టోళ్లను తన ప్రియ మిత్రుడు మెహిల్‌ మిస్త్రీకి రాశారు. తన పొరుగింట్లో ఉండే జేక్ మాలిటేకు ఇవ్వాల్సిన రూ.23 లక్షల అప్పును కూడా రద్దు చేశారు.

మూగజీవుల పట్ల తనకున్న ప్రేమను చాటుకుంటూ, తన పెంపుడు శునకాల సంరక్షణ కోసం రూ.12 లక్షల నిధిని ఏర్పాటు చేశారు. ప్రతి మూడు నెలలకు రూ.30 వేల చొప్పున వాటి సంరక్షణ కోసం ఖర్చు చేయనున్నారు.

వీలునామా ప్రకారం, రతన్ టాటాకు విదేశాల్లో కూడా రూ.40 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. సీషెల్స్‌లో భూములు, మోర్గాన్ స్టాన్లీ, వెల్స్ ఫార్గో వంటి ఆర్థిక సంస్థల్లో బ్యాంకు ఖాతాలు, అల్కోవా కార్పొరేషన్, హౌమెట్ ఏరోస్పేస్ వంటి కంపెనీల్లో షేర్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఆయన వద్ద 65 ఖరీదైన చేతిగడియారాలు ఉన్నాయి.

ఈ వీలునామాను పరిశీలించి ఆస్తుల పంపిణీ చేసేందుకు ఇప్పటికే బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

సాధారణంగా ఎంతోమంది తమ ఆస్తులను వారసులకు లేదా ఇతర బంధువులకు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ రతన్ టాటా మాత్రం తన జీవితంలో తోడుగా ఉన్న సిబ్బందికి పెద్ద మొత్తంలో ఇవ్వాలని నిర్ణయించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. ఒక సాధారణ వంటమనిషికి కోటి రూపాయలు ఇవ్వడం అనేది నిజంగా ఊహించని విషయం. అందుకే అందరూ ఆయన్ని "దేవుడు సామీ" అని కొనియాడుతున్నారు. రతన్ టాటా తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

Tags:    

Similar News