రేషన్ మాఫియా... పేర్నికే పరిమితమైతే..!
ఈ మొత్తం ఎపిసోడ్‌లో పేర్ని కుంటుంబం కంటే కూడా ప్రధానంగా వైసీపీ బద్నాం అయింది.
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై రేషన్ బియ్యం మాయం కేసులు నమోదు చేయడం.. ఈ క్రమంలో జరిమానాలు విధించడం తెలిసిందే. రేషన్ బియ్యాన్ని పేర్ని కుటుంబానికి చెందిన గోదాముల్లో నిల్వ ఉంచి.. అవసరం మేరకు వాటిని వినియోగిస్తున్నారు. దీనికి సంబంధించి అద్దెను కూడా ప్రభుత్వం చెల్లిస్తోంది. సరే.. ఏదేమైనా.. దీనిలో నుంచి బియ్యం బస్తాలు మాయం కావడం.. కోట్ల రూపాయలు జరిమానాలు చెల్లించడం వంటివి రాజకీయాల్లో దుమారం రేపాయి.
ఈ మొత్తం ఎపిసోడ్‌లో పేర్ని కుంటుంబం కంటే కూడా ప్రధానంగా వైసీపీ బద్నాం అయింది. వాస్తవానికి అసలు విషయానికి వస్తే.. రేషన్ మాఫియా ఇప్పుడు కొత్తకాదు. ఇప్పుడు కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించనూ లేదు. ఇది అతి పెద్ద బిజినెస్. తెలంగాణ, కర్ణాటక, కేరళ నుంచి అనేక రాష్ట్రాలకు ప్రమేయం ఉంది. దీనిలో చిన్న నుంచి పెద్ద వరకు అనేక మంది వ్యాపారాలు, రాజకీయ నేతలు సహా.. సినీ రంగానికి చెందిన వారి హస్తం కూడా ఉంది.
ఈ క్రమంలో రేషన్ అక్రమాలకు సంబంధించిన మూలాలను ఛేదించే ప్రయత్నాలు చేయడం బాగానే ఉన్నా.. అవి అంత సులభం అయితే కాదు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను నిర్మూలిస్తామంటూ..కేసీఆర్ హయాంలో ఎలా అయితే.. కామెంట్లు చేసి.. చేతులు ముడుచుకున్నారో..ఏపీలోనూ రేషన్ బియ్యంలో పరిస్థితి అలానే ఉంటుంది. ఇక, ఇప్పుడు ఈ కేసు మాత్రమే కనిపిస్తుండడం గమనార్హం అయితే.. బియ్యం ఎగుమతులు మాత్రం జరిగిపోతూనే ఉన్నాయి. కాకినాడ కాకపోతే.. మరో చోటు కావొచ్చు.
కానీ.. ఒకటి మాత్రం వాస్తవం...2024 చివరలో రేషన్ బియ్యం మాఫియాపై ఉక్కుపాదం మోపలేకపోయినా .. ఆ స్థాయిలో అయితే.. ప్రభుత్వం పనిచేసిందనే చెప్పాలి. రాత్రికి రాత్రి ఏమీ జరగలేకపోవచ్చు. కానీ, మార్పు కోసం ఓ అడుగు అయితే పడింది. దీనిని బట్టి.. భవిష్యత్తులో అయినా.. రేషన్ మాఫియా లేకుండా చేయాలని ఆశించవచ్చు. కానీ, మర్రిచెట్టు ఊడల్లా పెనవేసుకుపోయిన.. ఈ వ్యవహారం.. పేర్నికే పరిమితం అయితే... మాత్రం ప్రభుత్వానికి పెద్ద బ్యాడే అవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.