మళ్లీ అమరావతి అంటే సీమ రియాక్షన్ ?
చంద్రబాబు ఇంకా ప్రమాణం చేయలేదు కానీ అమరావతి రాజధాని పనులు జోరందుకుంటున్నాయి. దీని మీద రాయలసీమ నుంచి ఫస్ట్ రియాక్షన్ ఘాటుగానే వస్తోంది.
ఏపీలో రీజనల్ వైజ్ గా సెంటిమెంట్లు ఉన్నాయి. ఎవరికి వారు తమ ప్రాంతం బాగుండాలని కోరుకుంటారు. ఆ మాటకు వస్తే తెలంగాణాలోనూ ఈ తరహా రీజనల్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఉత్తర తెలంగాణా దక్షిణ తెలంగాణా అని మాట్లాడుతూంటారు. కానీ అవన్నీ కూడా ఒక స్థాయి దగ్గరే ఆగిపోతాయి.
కానీ ఏపీలో రీజియన్లతో పాటు సామాజిక సమీకరణలు కూడా ప్రభావం చూపిస్తూంటాయి. ఇదిలా ఉంటే ఏపీలో హోరా హోరీ పోరు అనుకున్నది కాస్తా ల్యాండ్ స్లైడ్ విక్టరీగా మారి టీడీపీ కూటమి భారీ ఆధిక్యతతో అధికారం లోకి వచ్చింది
చంద్రబాబు ఇంకా ప్రమాణం చేయలేదు కానీ అమరావతి రాజధాని పనులు జోరందుకుంటున్నాయి. దీని మీద రాయలసీమ నుంచి ఫస్ట్ రియాక్షన్ ఘాటుగానే వస్తోంది. రాజకీయంగా తలపండిన నేత, మాజీ హోం మంత్రి అయిన ఎంవీ మైసూరారెడ్ది ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్య్వూలో మాట్లాడుతూ చంద్రబాబు అమరావతి అంటూ అన్నీ అక్కడే పెడుతూ మరోసారి పొరపాటు చేయవద్దు అని సూచించారు.
చంద్రబాబు 2014లో సీఎం కాగానే శివరామకృష్ణన్ కమిషన్ సిఫార్సులను పక్కన పెట్టారు అని ఆయన విమర్శించారు. ఏపీలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములలో రాజధాని కట్టుకోవాలని ఆ కమిషన్ సూచించింది అని గుర్తు చేశారు. కానీ బాబు మాత్రం అమరావతిని ఎంచుకున్నారు అని అన్నారు. అమరావతికి దగ్గరలోనే దోనకొండలో ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున ఉన్నాయని అక్కడ రాజధాని కడితే అభ్యంతరం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు.
ఇక ఆయన ఒకసారి గత చరిత్రలోకి వెళ్ళారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయిన తరువాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని అపుడు కర్నూల్ రాజధానిగా ఉందని గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీ కోసం తాము కర్నూల్ ని త్యాగం చేశామని అన్నారు. అయితే 2014లో ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయాక రాయలసీమకే రాజధాని రావాల్సి ఉందని ఆయన అన్నారు.
కానీ అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారని, పోనీ రాజధాని అక్కడ ఏర్పాటు చేసినా రాయలసీమకు కొన్ని సంస్థలను ఇచ్చి న్యాయం చేయాల్సి ఉన్నా జరగలేదని అన్నారు. ఇపుడు కూడా అలాంటి పరిస్థితి వస్తే చంద్రబాబుకు కూడా ఇబ్బందులు తప్పవని సున్నితంగా హెచ్చరించారు. కరోనాకు ముందు దాకా ప్రత్యేక రాయలసీమ కోసం ఉద్యమిస్తామని చెప్పిన ఈ వృద్ధ నేత మరోసారి రాయలసీమ ప్రయోజనాలు అని అంటున్నారు.
మరి దాని భావమేంటి అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో రాయలసీమలో హైకోర్టు సహా కీలక సంస్థలను తరలించి అక్కడ కూడా రాజధాని హోదాకు సమానమైన అవకాశం కల్పించాలని సీమ నుంచి చాలా కాలంగా డిమాండ్ ఉంది. జగన్ దానిని సరిగ్గా అర్థం చేసుకోలేక చతికిలపడ్డారు. ఆయన విశాఖ అంటూ తన సొంత రాయలసీమను నిర్లక్ష్యం చేశారు. పూర్తిగా దెబ్బ తిన్నారు. దీంతో ఇపుడు మైసూరారెడ్డి గొంతు విప్పుతున్నారు.
మరి అది ఎంతవరకూ వెళ్తుంది అన్నది చూడాలి. మరో వైపు చూస్తే ఏపీకి అమరావతి రాజధాని అవసరం ఉందని అంతా అంటున్నారు. ముందు రాజధాని అక్కడ నిర్మించాలని కూడా కోరుతున్నారు. అయితే లార్జ్ స్కేల్ లో కాకుండా ఇపుడున్న పరిస్థితుల్లో ఒక రాజధానికి ఎంత అవసరమో చూసుకుని నిర్మించాలని సలహాలు వస్తున్నాయి.
అదే విధంగా అటు రాయలసీమకు ఇటు వెనకబడిన ఉత్తరాంధ్రాకు న్యాయం చేసేలా టీడీపీ ప్రభుత్వం తగిన జాగ్రత్తలతో చర్యలు తీసుకుంటే మంచిదని అంటున్నారు. మైసూరారెడ్డి అన్నారని కాదు కానీ ఏపీలో ఉన్న మూడు రీజియన్ల సెంటిమెంట్లను గౌరవించడం వల్లనే ఆంధ్ర రాష్ట్రాన్ని పటిష్టంగా ముందుకు తీసుకుని పోవచ్చు అన్నది మేధావుల ఆలోచనగా ఉంది.