'పేదల' రాజకీయం వదిలేయండి: ఆర్బీఐ
ఈ విషయాలను తాజాగా ఆర్బీఐ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. పేదల రాజకీయం వదిలేయా లని తేల్చి చెప్పింది. అయితే.. ఆర్బీఐ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలపై తాజాగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని.. అక్కడ పార్టీలు ప్రజలకు హామీలను గుప్పిస్తున్నాయి. ఇక, ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హరియాణ ఎన్నికల్లోనూ హామీలు కుమ్మరించారు. ఈ విషయాలను తాజాగా ఆర్బీఐ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. పేదల రాజకీయం వదిలేయా లని తేల్చి చెప్పింది. అయితే.. ఆర్బీఐ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.
ఆర్బీఐ ఏమంది!
పేదలను కేంద్రంగా చేసుకుని పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలతో దేశం అల్లకల్లోలం అవుతోందని తెలి పింది. ఉచిత విద్యుత్తు, ఉచిత ప్రజారవాణా(ఆర్టీసీ), ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, యువతకు నిరుద్యోగ భృతి, రైతులకు రుణ మాఫీ, పెట్టుబడి సాయం, మహిళలకు నిధులు.. ఇలాంటి వాటి వల్ల రాష్ట్రాల పెట్టు బడి వ్యయం తగ్గిపోయిందని తెలిపింది. ఇది మున్ముందు కూడా సాగితే.. రాష్ట్రాలు మరిన్ని అప్పులు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో వాటిని తక్షణమే వదిలి పెట్టేందుకు ప్రయత్నించాలని సుద్దులు చెప్పింది.
నెటిజన్ల కామెంట్లు ఇవీ..
పేదలకు ఉచితాలు, నిరుద్యోగులకు భృతి ఇవ్వడాన్ని తప్పుబట్టిన ఆర్బీఐపై నెటిజన్లు నిప్పులు చెరిగారు. 4 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ల రుణాలు మాఫీ చేస్తే ఏమీ కాదా?.. బడా కార్పొరేట్ల టాక్స్ తగ్గిస్తే ఏమీ కాదా? వాళ్లకు ఉచితంగా భూములు, బ్యాంకుల్లో డబ్బులు, మౌలిక సదుపాయాల పేరుతో అన్ని కట్టబెడితే ఏమి కాదా? అని నెటిజన్లు ప్రశ్నించారు. సమాజంలో చేయూత ఇవ్వాల్సిన మహిళలకు ఇస్తే మాత్రం వనరులు తగ్గిపోతాయా? పకృతి సంపదను కార్ఫోరేట్ సంస్థలకు అప్పన్నంగా అప్పగిస్తే మాత్రం.. దేశానికి, రాష్ట్రాలకు ఏమీ కాదా? అని ప్రశ్నించడం గమనార్హం.
కాగా, గతంలో ఆర్బీఐ గవర్నర్‌గా రంగరాజన్ ఉన్నప్పుడు కూడా.. ఉచిత పథకాలు ఇచ్చే రాష్ట్రాలకు అప్పులు ఇవ్వడం తగ్గిస్తామని పేర్కొన్నారు. ఇది అప్పట్లో పెను దుమారానికి దారి తీసింది. ఆయన మంచి సంస్కరణలు చేయాలని అనుకున్నా.. రాజకీయ నేతలు ముందుకు సాగకుండా.. కాళ్లకు బంధం విధించారనే విమర్శలు ఉన్నాయి.