లాభాల్లో ఉన్నా.. మనసు కరగలేదా? !
ప్రస్తుతం ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని.. ఆశించిన విధంగానే ఆర్థిక రథం పరుగులు పెడుతోందని ఆర్బీఐ గవర్నర్ పదే పదే చెబుతున్నారు.
ప్రస్తుతం ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని.. ఆశించిన విధంగానే ఆర్థిక రథం పరుగులు పెడుతోందని ఆర్బీఐ గవర్నర్ పదే పదే చెబుతున్నారు. దీంతో దేశ్యావ్యాప్తంగా చిరు , మధ్యతరగతి వ్యాపారుల నుంచి గృహరుణం తీసుకున్న వారి వరకు కూడా అందరూ వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టిస్తారని.. తమపై భారాలు కొంత వరకైనా అదుపులోకి వస్తాయని భావించారు. ముఖ్యంగా ద్రవ్యపరపతి విధానంలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని చెప్పిన దరిమిలా.. ఎంతో ఆశ పడ్డారు.
కానీ, లాభాల్లో ఉన్నామని చెబుతున్నా.. కీలకమైన వడ్డీ రేట్లను ఎక్కడా తగ్గించకపోవడం గమనార్హం. తాజాగా ఆర్బీఐ గవర్నర్.. వడ్డీ రేట్లకు సంబంధించిన కీలక ప్రతిపాదనలు చేశారు. రెపో , రివర్స్ రెపో వడ్డీ రేటు విషయంలో ఎలాంటి మార్పూ లేదని తేల్చి చెప్పారు. వరుసగా 6వ సారి రెపో రేటు విషయంపై ప్రస్తావిస్తూ.. మీడియాతో మాట్లాడిన గవర్నర్ శక్తికాంత దాస్.. ఈ వడ్డీరేటును యథాతథంగా 6.50 శాతంగా కొనసాగించనున్నట్టు ప్రకటించారు.
‘మోనిటరీ పాలసీ కమిటీ’ నిర్ణయం తీసుకున్న మేరకు .. దీనిని యథాతథంగా కొనసాగిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఫలితంగా గత సంవత్సరం ఏప్రిల్ నుంచి ఉన్న వడ్డీ రేటే ప్రస్తుతం కూడా కొనసాగనుంది. ``వృద్ధికి ఊతమివ్వడం, ద్రవ్యోల్బణం ఆర్బీఐ పరిధి దాటకుండా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాం`` అని శక్తికాంత్ దాస్ చెప్పారు. రెపో రేటు విషయంలో సర్దుబాటు వైఖరిని పాటించాలని ఆరుగురు ఎంపీసీ సభ్యుల్లో ఐదుగురు అభిప్రాయపడ్డారని తెలిపారు.
వడ్డీ రేట్లు తగ్గించకపోతే..
దేశంలో వడ్డీ రేట్లు తగ్గించకపోతే.. ధరలు అలానే పెరుగుతుంటాయి. ప్రస్తుతం నిత్యావసర ధరలు రోజు రోజుకు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పప్పులు, అపరాలు.. సుగంధ ద్రవ్యాల పరిధిలో ఉన్న జీలకర్ర, వాము, ఇంగువ వంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అదే వడ్డీ ధరలు తగ్గితే.. కొంత మేరకు ద్రవ్యోల్బణం తగ్గి.. అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది.