2వేల నోట్ల మార్పిడి... ఆర్బీఐ కీలక నిర్ణయం!

ఇలా సెప్టెంబర్‌ 30 వరకు ఉన్న గడువును అక్టోబర్‌ 7 వరకు పొడిగించడం కొంత ఊరట కలించినట్లేనని అంటున్నారు వినియోగదారులు.

Update: 2023-09-30 16:33 GMT

రూ.2000 నోట్ల మార్పిడికి గడువు ఈ రోజు (సెప్టెంబర్‌ 30)తో ముగియనున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే ఆఖరి రోజా? లేక, గడువు పొడిగిస్తారా? అనే సందిగ్ధంత ఉండేది. అయితే తాజాగా ఈ సందిగ్ధతను తొలగించే పనికి పూనుకుంది ఆర్బీఐ. ఇందులో భాగంగా వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌ చెబుతూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... రూ2000 నోట్లను మార్పిడి చేసుకునేందుకు గడువు పొడిగిస్తారా.. లేక, ముందుగా ప్రకటించినట్లుగానే సెప్టెంబర్ 30తోనే ముగిస్తార అనే విషయంపై ఆర్బీఐ కీలక నిర్ణయం వెల్లడించింది. రెండు వేల నోట్ల మార్పిడి గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... అక్టోబర్‌ 7వ తేదీ వరకు రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది!

ఇలా సెప్టెంబర్‌ 30 వరకు ఉన్న గడువును అక్టోబర్‌ 7 వరకు పొడిగించడం కొంత ఊరట కలించినట్లేనని అంటున్నారు వినియోగదారులు. అయితే ఈ పెద్ద నోట్లు కలిగిన వారు గడుపు లోపు సమీపంలోని ఏదైనా బ్యాంకుకు వెళ్లి నోట్లను మార్పిడి చేసుకునే వెసులు బాటు ఉందని తెలిపింది.

అయితే... గతంలో రెండు వేల నోట్లను మార్పిడి చేసుకోవడం లేదా డిపాజిట్‌ చేయడం వంటివి చేస్తే కచ్చితంగా ఆధారాలు ఇవ్వాలని, బ్యాంకు సిబ్బంది అడిగిన పత్రాలు సమర్పించాలని వార్తలు వచ్చాయి. అయితే ఆధార్‌, పాన్‌ కార్డు వంటి వివరాలు అందించకుండానే బ్యాంకులో సులభంగా నోట్లను మార్పిడి చేసుకోవడం, లేదా డిపాజిట్‌ చేసుకోవడం చేయవచ్చని తాజాగా ఆర్బీఐ స్పష్టం చేసింది.

కాగా, మే 19, 2023న పెద్ద నోట్లయిన 2000 రూపాయల నోట్లను చెలామణి నుంచి తొలగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు నాలుగు నెలల సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీని గడువు సెప్టెంబర్ 30తో ముగిసింది. ఈ సమయంలో ఆ గడువు పొడిగిస్తూ ఆర్బీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది.

ఇదే సమయంలో మే 19 నుంచి సెప్టెంబర్‌ 1వ తేదీ వరకు సుమారు 93 శాతం వరకు ఈ రెండు వేల రూపాయల నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని ఆర్బీఐ నివేదికలు తెలిపాయి. మరి పొడిగించిన గడువు పూర్తయ్యే నాటికి ఎంత శాతం నోట్లు వెనక్కి వస్తాయనేది వేచి చూడాలి.

Tags:    

Similar News