హైదరాబాద్ లో లేడీ ‘అన్’ లక్కీ భాస్కర్!

ఈ సినిమాను చూసి స్ఫూర్తి పొందారో.. లేదంటే మరెలా ఆలోచించారో కానీహైదరాబాద్ కు చెందిన ఒక మహిళా ఇన్ స్పెక్టర్ ఒక కేసులో జప్తు చేసిన మొత్తంలో రూ.40 లక్షలు కొట్టేశారు.

Update: 2025-02-15 05:30 GMT

ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని సూపర్ సక్సెస్ మూవీ లక్కీ భాస్కర్. నిజానికి థియేటర్లలో విడుదలై దానితో పోలిస్తే.. ఓటీటీలో రిలీజ్ తర్వాత ఈ మూవీ మరింత పాపులర్ కావటమే కాదు ఒకటికి రెండుసార్లు చూసిన తర్వాత కూడా మళ్లీ మరోసారిచూడాలన్న కిక్ ఇచ్చేస్తుంది ఈ మూవీ. దీన్ని చూడనోళ్లకు సింఫుల్ గా రెండు లైన్లలో సినిమాస్టోరీ చెప్పేసి.. అసలు విషయంలోకి వెళదాం. ఎందుకంటే.. ఈ మూవీ లైన్ తెలీకుండా.. ఈ రియల్ క్రైం గురించి తెలిసినా అంత కిక్ ఉండదు.

మూవీలో హీరో బ్యాంక్ క్యాషియర్ గా పని చేస్తుంటాడు. పని పూర్తి అయిన తర్వాత డబ్బుల్ని స్ట్రాంగ్ రూంలో జమ చేయాలి. అందుకు భిన్నంగా వారాంతాల్లో ఆ డబ్బుల్లో కొంత మొత్తాన్ని తనతో తీసుకెళ్లి.. బయట వ్యాపారం చేసి వారం మొదట్లో ఆ మొత్తాన్ని తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా సర్దేస్తాడు. ఈ రెండు రోజుల వ్యవధిలో ఆ డబ్బుతో భారీగా డబ్బు పోగేస్తాడు. అతగాడు చేసే తప్పులు సినిమాలో బయటకు వచ్చినా.. అప్పటికే లక్కీగా తప్పించుకుంటాడు. లక్కీ భాస్కర్ గా నిలుస్తాడు.

రీల్ మాదిరి రియల్ లైఫ్ ఉండదు కదా? ఈ సినిమాను చూసి స్ఫూర్తి పొందారో.. లేదంటే మరెలా ఆలోచించారో కానీహైదరాబాద్ కు చెందిన ఒక మహిళా ఇన్ స్పెక్టర్ ఒక కేసులో జప్తు చేసిన మొత్తంలో రూ.40 లక్షలు కొట్టేశారు. అనుకున్న సమయానికి ఆ మొత్తాన్ని జమ చేయటంలో జరిగిన తేడాతో ఉన్నతాధికారులకు అడ్డంగా బుక్ అయ్యారు. సినిమాలో లక్కీ అయిన హీరో.. రియల్ లైఫ్ లో మాత్రం ఈ లేడీ భాస్కర్ అన్ లక్కీగా నిలిచారు. సదరు మహిళా అధికారి చేసిన మోసాన్ని గర్తించిన ఉన్నతాధికారులు ఆమెను బదిలీ వేటు వేసినట్లుగా తెలిసింది.

హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకున్న ఈ క్రైం ఉదంతం పోలీసు వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ అధికారిణి ఆన్ లైన్ మోసాల విభాగంలో పని చేస్తుంటారని చెబుతున్నారు. ఇటీవల ఒక కేసులో ప్రైవేటు సంస్థకు చెందిన రూ.40 లక్షల మొత్తాన్ని సీజ్ చేశారు. ఆ డబ్బును డిపార్ట్ మెంట్ లో జమ చేయకుండా తన వద్దే ఉంచుకున్నారు. అధికారులు అడిగితే త్వరలో జమ చేస్తానని చెప్పేవారు. తన దగ్గర ఆ మొత్తం ఉన్న విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పానని బిల్డప్ ఇచ్చేశారు. అయితే.. ఇటీవల ఆమె భాగోతమంతా బయటకు రావటంతో సీనియర్ అధికారులు సైతం అవాక్కు అయిన పరిస్థితి. దీంతో.. ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నా.. అది కాస్తా మీడియా పుణ్యమా అని బయటకు వచ్చేసింది.

Tags:    

Similar News