కృష్ణ వైసీపీ నేతలే ఎందుకు టార్గెట్ అవుతున్నారు?

రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసులు నమోదు ప్రక్రియ నడుస్తున్నా, ఎక్కువగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన నేతలే ఎక్కువగా కేసులను ఎదుర్కొంటున్నారు.

Update: 2024-12-18 15:30 GMT

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదు చేస్తోంది. ఇందులో ఎక్కువగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన నేతలే ఎక్కువగా ఉంటున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారాలు, కుంభకోణాలతోపాటు టీడీపీ నేతలు, ఆ పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులకు సంబంధించిన కేసులను నమోదు చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేశ్ వంటివారిపై వివిధ కేసులు నమోదు చేయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసులు నమోదు ప్రక్రియ నడుస్తున్నా, ఎక్కువగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన నేతలే ఎక్కువగా కేసులను ఎదుర్కొంటున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పలు సంచలన కేసులను తెరపైకి తెచ్చింది. మైనింగ్, మద్యం కుంభకోణాలతోపాటు ముంబై సినీ నటి జెత్వానీ నిర్బంధం, మంగళగిరి, గన్నవరం టీడీపీ కార్యాలయాలపై దాడి కేసులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం. ఇందులో నిందితులు ఎక్కువగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వారే ఉండటం గమనార్హం. మైనింగ్, మద్యం స్కాంల్లో అధికారులను అరెస్టు చేయగా, జెత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అరెస్టు అయ్యారు. ఇక మిగిలిన కేసుల్లో ఉమ్మడి కృష్ణ వైసీపీ నేతలు కొడాలి నాని, జోగి రమేశ్, వల్లభనేని వంశీ, దేవినేని అవినాశ్, తలశిల రఘురాం వంటివారి పేర్లు ఉన్నాయి. ఇక తాజాగా మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం అయ్యయనే ఆరోపణలతో మరో మాజీ మంత్రి పేర్ని నానిని అరెస్టు చేసేందుకు పావులు కదుపుతోంది ప్రభుత్వం.

ఉమ్మడి కృష్ణ జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ మొత్తం స్థానాలను కూటమి పార్టీలే గెలుచుకున్నాయి. ఇక ఓటమి తర్వాత వైసీపీ నేతలకు కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఆ తర్వాత ఈ ఇద్దరు నేతలు అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయారు. కొడాలిపై రెండు కేసులు నమోదు అవ్వగా, ఆయన ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. అదేవిధంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడుగా చేర్చారు. ఈ కేసులతోపాటు ఈ ఇద్దరిపై మరికొన్ని కొత్త కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. వంశీపై అక్రమ మట్టి తవ్వకాల కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. అదేవిధంగా కొడాలిపై భూ ఆక్రమణ కేసులు నమోదు చేస్తారంటున్నారు. మరోవైపు అగ్రిగోల్డ్ భూముల ఆక్రమణలకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు అరెస్టు అయ్యారు. జోగి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితుడు. ఆయన ప్రస్తుతం కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు.

ఇక మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ కీలక నేతలు దేవినేని అవినాశ్, తలశిల రఘురాం న్యాయపోరాటం చేస్తున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో ముఖ్యమైన నేతలు అంతా కేసులను ఎదుర్కొంటుండగా, ఇన్నాళ్లు మాజీ మంత్రి పేర్ని నాని ఒక్కరే కాస్త ఫ్రీగా కనిపించారు. ఇప్పుడు ఆయన వంతు వచ్చినట్లుగా రేషన్ బియ్యం మాయం కేసు తెరపైకి వచ్చింది.

మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని కుటుంబ సభ్యుల నుంచి అద్దెకు తీసుకున్న గొడౌన్లలో బియ్యం మాయమయ్యాయని గత కొద్ది రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. దీనిని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం పేర్ని నాని భార్య జయసుధ, ఆయన అత్త సత్యనారాయణమ్మ పేరిట ఉన్న గొడౌన్లలో తనిఖీలు చేయగా, దాదాపు రెండు కోట్ల 20 లక్షల రూపాయల విలువైన బియ్యం మాయమయ్యాయని నిర్థారించింది. ఇందులో సుమారు కోటి 70 లక్షల రూపాయలను మాజీ మంత్రి పేర్ని ప్రభుత్వానికి చెల్లించారు. అయినప్పటకీ ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. దీంతో ఒకరిద్దరు దళిత నేతలు తప్పితే ప్రధాన నేతల్లో దాదాపు అందరిపైనా కేసులు నమోదు చేసి కోర్టులు చుట్టూ తిప్పే పరిస్థితులే కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లు అధికార పార్టీ నేతలుగా చక్రం తిప్పిన నేతలు, ఇప్పటి ప్రతికూల పరిస్థితులతో ఉక్కపోత అనుభవిస్తున్నారు.

Tags:    

Similar News