పెందుర్తిలో బండారు.. గడబిడ!
ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వారికి సీటు ఖాయమన్న ప్రచారం జరగడంతో బండారు కూడా అదే లైన్‌లో ముందుకు సాగారు.
కీలకమైన ఎన్నికల సమయం. గెలిచి తీరాల్సిన పట్టుదల ఒకవైపు.. అంతేస్థాయిలో అసంతృప్త నేతాగ ణం మరోవైపు.. వెరసి ఏపీలో చేతులు కలిపిన బీజేపీ-టీడీపీ-జనసేనలకు చుక్కలు కనిపిస్తున్నాయన డంలో సందేహం లేదు. ముఖ్యంగా విశాఖ జిల్లాలోని పెందుర్తి వంటి కీలకమైన నియోజకవర్గంలో కూట మిలో సఖ్యత కనిపించడం లేదు. దీనికి కారణం.. సీటు ఒకరు తీసుకుని టికెట్ మరొకరికి ఇవ్వడమే. ఈ పరిణామమే పెందుర్తిలో రాజకీయాలను కుదిపేస్తోంది.
పొత్తులో బాగంగా ఈ సీటును జనసేన దక్కించుకుంది. ఎందుకంటే.. ఇక్కడ కాపుల ప్రాబల్యానికి తోడు మెగా అభిమానులు ఎక్కువగా ఉన్నారు. దీంతో గతంలోనూ ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ విజయం దక్కించు కుంది. ఈ ఈక్వేషన్‌తోనే జనసేన ఈ టికెట్ కోసం పట్టుబట్టి మరీ దక్కించుకుంది. అయితే.. ఇదే సీటును టీడీపీ నేత.. బండారు సత్యనారాయణ మూర్తి కూడా ఆశించారు. అంతేకాదు.. నారా లోకేష్ ప్రజాగళం పాదయాత్రలో చెప్పినట్టు.. ఈయన వైసీపీ పై దుమ్మెత్తి పోశారు.
ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వారికి సీటు ఖాయమన్న ప్రచారం జరగడంతో బండారు కూడా అదే లైన్‌లో ముందుకు సాగారు. అయితే.. కూటమిలో భాగంగా జనసేనకు కేటాయించారు. ఇది ఫస్ట్ ఎఫె క్ట్. దీంతో బండారుకు ఏకంగా బీపీ డౌన్ అయిపోయి.. ఆసుపత్రిలోనూ చేరిపోయారు. కట్ చేస్తే.. జనసేన తీసుకున్న ఈ సీటులో వైసీపీ నుంచి వచ్చిన పంచకర్ల రమేష్ బాబుకు అవకాశం ఇచ్చారు. ఈయన గతంలో టీడీపీలో ఉన్న నాయకుడే. కానీ, బండారుకు, పంచకర్లకు మద్య రాజకీయ వివాదాలు ఉన్నాయి.
ఈ క్రమంలో పంచకర్లకు అనుకూలంగా ప్రచారం చేసేందుకు.. బండారు సుముఖత వ్యక్తం చేయకపోగా.. టికెట్‌పై దింపుడుకళ్లం ఆశలతోనే ఉన్నారు. పార్టీ కోసం ఎంతో చేశానని.. ఎన్నో కేసులు కూడా పెట్టించుకున్నానని ఆయన చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం బండారుకు అనుకూలంగా పరిస్థితిలేదు. మరోవైపు..చంద్రబాబు కూడా ఆయన విన్నపాన్ని తిరస్కరించి.. కలిసి పనిచేసి పంచకర్ల గెలుపునకు కృషి చేయాలని అన్నారు.
ఇది మరింతగా బండారుకు మంట పెట్టింది. అసలే టికెట్ రాక ఏడుస్తుంటే.. తన ప్రత్యర్థి.. వైసీపీ నుంచి వచ్చి తన కంచం లాగేసుకున్న వ్యక్తికి ఎలా పనిచేయాలన్నది బండారు గడబిడ. దీంతో ఈయన సైలెం ట్ అయ్యారు. అయితే.. ఇక్కడే చంద్రబాబు మంత్రాంగం పనిచేసింది. బండారును వ్యతిరేకించే వర్గాన్ని ఆయన లైన్‌లో పెట్టారు. దీంతో గండి బాబ్జీనిప్రచారంలోకి పంపించారు. దీంతో బండారు లేకపోయినా.. ప్రచారం జరుగుతోంది. కానీ, బండారుకు అనుకూలంగా 20 వేల ఓట్లు అయితే ఉన్నాయనేది వాస్తవం. మరి ఇది ఎటు మళ్లుతుంది.. అనేది చూడాలి.