పాతపట్నం ఆమెకేనా...వైసీపీలో కొత్త చర్చ !

శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీకి బలమైన రాజకీయ స్థావరంగా ఉంటూ వచ్చింది.

Update: 2025-02-22 04:30 GMT

శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీకి బలమైన రాజకీయ స్థావరంగా ఉంటూ వచ్చింది. 2014, 2019లలో ఆ పార్టీయే గెలిచింది. 2014లో కలమట వెంకటరమణ గెలిచి మూడేళ్ళ తరువాత టీడీపీలోకి మారిపోయారు ఇక 2019లో రెడ్డి శాంతి వైసీపీ పక్షాన గెలిచారు ఆమె 2024లో ఓటమి పాలు అయ్యారు.

అయితే రెడ్డి శాంతి అయిదేళ్ళూ నియోజకవర్గానికి దూరంగానే ఉన్నారని ఆమె ఢిల్లీలో ఎక్కువ సమయం గడిపేవారు అన్న అసంతృప్తి పార్టీలోనూ ఉంది. అదే నియోజకవర్గంలోనూ కనిపించింది. వర్గ పోరు కూడా ఈ కారణంగా పెరిగింది. ఆమె కుమారుడు జెడ్పీటీసీగా పోటీ చేస్తే ఓటమి పాలు కావడం వెనక వర్గ పోరుతో పాటు పార్టీలో ఆమెకు పట్టు తగ్గడమే అని అంటారు.

ఆమెను 2024 ఎన్నికల ముందు మార్చాలని వైసీపీలో డిమాండ్ వచ్చినా తిరిగి ఆమెకే టికెట్ ఇచ్చారు. ఇక ఇపుడు కూడా ఆమె అక్కడ ఇంచార్జిగా ఉన్నారు. తాజాగా జగన్ పాలకొండ వచ్చి దివంగత నేత మాజీ ఎంపీ అయిన పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబం పట్ల తనకు ఉన్న అభిమానాన్ని ఆయన అలా చాటుకున్నారు.

పాలవలస రాజశేఖరం కుమార్తెగానే రెడ్డి శాంతికి వైసీపీలో కీలక స్థానాన్ని అధినాయకత్వం కల్పిస్తోంది. దాంతో ఆమెకు మరిన్ని అవకాశాలు ఇస్తారని అంటున్నారు. 2029లో ఆమెనే మళ్ళీ పోటీకి నిలబెడతారు అని కూడా అంటున్నారు.

అయితే రెడ్డి శాంతి పార్టీని పటిష్టం చేయాలని అదే విధంగా పార్టీలో వర్గాలకు అతీతంగా అందరినీ కలుపుకుని పోవాలని అంటున్నారు. నియోజకవర్గానికి దూరంగా ఉంటూ రాజకీయాలు చేస్తే ఫలితాలు చేదుగానే వస్తాయని అంటున్నారు.

నిజానికి చూస్తే పాలవలస రాజశేఖరం కుటుంబానికి పాలకొండ పాతపట్నంలలో మంచి పట్టు ఉంది. అయితే దానిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. అయితే మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఈసారికి పాలవలస రాజశేఖరం కుమారుడు ఎమ్మెల్సీ విక్రాంత్ పాత పట్నం నుంచి పోటీ చేస్తారు అన్నది ఆ ప్రచారం.

మరి అక్కా తమ్ముళ్ళు ఇద్దరిలో ఎవరికి సీటు ఇస్తారో అన్నది ఇప్పటికి అయితే తెలియదు కానీ పాతపట్నంలో మాత్రం పాత రాజకీయమే కంటిన్యూ అవుతుందన్నది వాస్తవం అంటున్నారు. ఆ విధంగానే ఇపుడు పార్టీలో కొత్త చర్చ సాగుతోంది. కొన్ని కుటుంబాలతో వైసీపీ అధినాయకత్వానికి ఉన్న అనుబంధం వల్లనే అక్కడ ఏ మార్పులూ ఉండవని అంటున్నారు. అయితే పార్టీ ప్రయోజనాలను సైతం చూసుకుంటూ పార్టీ సరైన వారికి సరైన అవకాశం ఇస్తేనే విజయాలు మరింతగా చేరువ అవుతాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగనుందో.

Tags:    

Similar News