సెల్ప్ యాక్సిడెంట్ తో రిమాండ్ కు.. భాగ్యనగరి ప్రజలు జర జాగ్రత్త

అతి వేగంగా వాహనాన్ని నడిపే క్రమంలో తమకు తాము యాక్సిడెంట్ (ఎదురుగా ఉండే స్తంభాన్ని కానీ.. డివైడర్ ను కానీ ఢీ కొట్టటం) చేసుకోవటాన్ని సెల్ఫ్ యాక్సిడెంట్ గా పరిగణించే వారు.

Update: 2024-03-14 04:27 GMT

హైదరాబాద్ మహానగర ప్రజలు మరింత జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సిందే. వాహనాలతో రోడ్డు మీదకు వచ్చే వారు ఒళ్లు దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేయాల్సిన టైం వచ్చేసింది. వాహనాన్ని నడిపే సమయంలో సెల్ప్ యాక్సిడెంట్ కు గురైతే ఇప్పటివరకు సాధారణ కేసుగా నమోదు చేసే వారు. కానీ.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఐదుగురు నిందితుల్ని రిమాండ్ కు పంపిన వైనం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారటమే కాదు.. తెలంగాణ పోలీసింగ్ లో సరికొత్త కేస్ స్టడీగా మారనుంది.

బాధ్యత లేకుండా డ్రైవ్ చేసే వారంతా ఒళ్లు దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేయాల్సిన టైం వచ్చేసిందని చెప్పాలి. వాహనాన్ని డ్రైవ్ చేసేటప్పుడు మరో వాహనాన్ని ఢీకొడితే యాక్సిడెంట్ గా పేర్కొనటం తెలిసిందే. అందుకు భిన్నంగా నిర్లక్ష్యంగా.. అతి వేగంగా వాహనాన్ని నడిపే క్రమంలో తమకు తాము యాక్సిడెంట్ (ఎదురుగా ఉండే స్తంభాన్ని కానీ.. డివైడర్ ను కానీ ఢీ కొట్టటం) చేసుకోవటాన్ని సెల్ఫ్ యాక్సిడెంట్ గా పరిగణించే వారు.

ఇలాంటి ఉదంతాల్లో సాధారణ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేవారు. ఇందుకు భిన్నంగా మార్చి 10న అర్థరాత్రి దాటిన తర్వాత జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 45లో ఒక కారు అదుపు తప్పి.. డివైడర్ పైకి దూసుకెళ్లింది. కారు నడుపుతున్న మల్లికార్జునరెడ్డి అతడి స్నేహితులు (సంతోష్, అరవింద్) మద్యం తాగినట్లుగా పోలీసులు గుర్తించారు. కారులో మరో మైనర్ కూడా ఉన్నాడు.

ఈ ఉదంతంలో వీరిపై సెక్షన్ 336, 279 మోటారు వాహన చట్టంతో పాటు ప్రజా ఆస్తుల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. అదే రోజున జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 2లో ఒక కారు వేగంగా వచ్చి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ఉదంతంలో కారు నడుపుతున్న వ్యక్తి కారును వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఉదంతంలో మలక్ పేటకు చెందిన బీటెక్ విద్యార్థి మహమ్మద్ ఫర్హాన్ పాషా, తలాబ్ కట్టకు చెందిన లా విద్యార్థి అనూష్ పెర్షద్ లపైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఈ రెండు ఘటనలకు సంబంధించి నిందితుల్ని మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. అతి వేగం.. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపటం.. ప్రజా ఆస్తుల్ని ధ్వంసం చేసిన కారణాల్ని చూపిస్తూ పోలీసులు సమర్పించిన పక్కా నివేదికతో న్యాయాధికారి ఐదుగురు నిందితులకు 14రోజుల పాటు రిమాండ్ విధిస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. వాహనదారులకు.. పాదచారులకు ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ.. ఇలాంటి ఉదంతాలు రిపీట్ కాకుండా ఉండేందుకు రిమాండ్ విధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మరొకరిని జువైనల్ ను డీపీవో పర్యవేక్షణలో ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ ను చూస్తే.. రోడ్ల మీదకు వాహనాల్ని తీసుకొని వచ్చే వారు మరింత అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా జైలుకు ఖాయమన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరముంది.

Tags:    

Similar News