రిటైర్డు మహిళా ప్రొఫెసర్ నుంచి రూ.1.6 కోట్లు దోచిన సైబర్ బందిపోట్లు

అధికార యంత్రాంగం.. ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేస్తున్నా సరే.. సైబర్ బందిపోట్ల దారుణాలు ఆగటం లేదు.;

Update: 2025-04-16 04:43 GMT
Retired Professor Scammed of ₹1.6 Crore in Fake CBI

అధికార యంత్రాంగం.. ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేస్తున్నా సరే.. సైబర్ బందిపోట్ల దారుణాలు ఆగటం లేదు. ప్రజల్లో అవగాహన కల్పించటం ద్వారా వారి ఎత్తులకు చెక్ పెట్టేందుకు వీలుగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. డిజిటల్ అరెస్టు అన్నది ఏమీ ఉండదని.. అలాంటి ఫోన్ కాల్స్ ను నమ్మొద్దంటూ నెత్తినోరు కొట్టుకుంటున్న పరిస్థితి. అయినప్పటికి పరిస్థితుల్లో మాత్రం మార్పు రావటం లేదు. తాజాగా ఒక రిటైర్డు మహిళా ఫ్రొఫెసర్ నుంచి సైబర్ బందిపోట్లు రూ.1.60 కోట్ల భారీ మొత్తాన్ని దోచేసిన షాకింగ్ నిజం వెలుగు చూసింది.

సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయటంతో ఈ విషయం కాస్తా వెలుగు చూసింది. మేడ్చల్ కు చెందిన 78 ఏళ్ల రిటైర్డు మహిళా ప్రొఫెసర్ కు సైబర్ బందిపోట్ల నుంచి ఇటీవల వాట్సప్ వీడియో కాల్ వచ్చింది. ఢిల్లీ సైబర్ క్రైం నుంచి మాట్లాడుతున్నట్లుగా చెప్పి.. మనీలాండరింగ్ అభియోగాలపై ఈడీ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. తాను అలాంటి తప్పుడు పనులేమీ చేయలేదని ఎంతగా మొత్తుకున్నా.. వారు మాట వినలేదు.

ఆమె అనుమానితుల జాబితాలో ఉన్నారని.. సీబీఐ అధికారులతో మాట్లాడాలని చెప్పారు. ఆ తర్వాత సీబీఐ అధికారినంటూ మరో వ్యక్తి ప్రొఫెసర్ కు కాల్ చేశారు. అంతర్జాతీయ మనీ లాండరింగ్ తో ప్రమేయం ఉందని.. పాస్టుపోర్టు రద్దు అవుతుందని.. విదేశాలకు వెళ్లలేరని భయపెట్టారు. ఎక్కడెక్కడ బ్యాంకు ఖాతాలు ఉన్నాయో వివరాలు ఇవ్వాలని అడగ్గా.. ప్రొఫెసర్ ఆ వివరాల్ని పంపారు. బ్యాంకు లావాదేవీల్ని తనిఖీ చేసి మనీలాండరింగ్ చేసినట్లుగా గుర్తిస్తే అరెస్టు చేస్తామని చెప్పారు.

రిజర్వు బ్యాంకు తనిఖీ పూర్తయ్యే వరకు ఖాతాల్లోని డబ్బు తమకు బదిలీ చేయాలని చెప్పారు. అందుకు ట్రాయ్.. సిబీఐ.. ఢిల్లీ ఆర్థిక శాఖతో ఒప్పందం చేసుకున్నట్లుగా ఒక పత్రాన్ని పంపారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు దేశం విడిచి వెళ్లొద్దంటూ హెచ్చరించటమే కాదు.. సీబీఐతో చేసుకున్నఒప్పంద విషయాన్ని ఇతరులకు చెప్పటం చట్టవిరుద్ధమవుతుందని.. అందుకు ఐదేళ్లు జైలుశిక్ష పడుతుందని బెదిరించారు.

వారు చెప్పిందంతా నిజమని భావించిన సదరు మహిళా ప్రొఫెసర్.. సదరు సైబర్ బందిపోట్లు చెప్పిన ఖాతాలకు రూ.కోటి మొత్తాన్ని బదిలీ చేశారు. తర్వాత మళ్లీ ఫోన్ చేసి మరింత డబ్బులు పంపాలని కోరటంతో.. బంధువుల వద్ద అప్పు చేసి మరీ విడతల వారీగా రూ.60 లక్షలు బదిలీ చేశారు. ఆ తర్వాత తెలిసిన వారి ద్వారా అదంతా మోసమన్న విషయాన్ని తెలుసుకొని సైబర్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఈడీ.. సీబీఐ.. ఆర్ బీఐ.. ఇలాంటి వారెవరు వీడియోకాల్స్ ద్వారా విచారణ జరపరు. అంతేకాదు.. డిజిటల్ అరెస్టు అన్న పదమే లేదని.. ఇది కేవలం సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేసిన బూచి అన్నది మరవొద్దు. వారు చెప్పే మాటలు విన్నంతనే టెన్షన్ పుట్టించేలా ఉంటాయి.కానీ.. ఆ మాటల్ని విన్నంతనే తెలిసిన వారికి చెప్పటం.. ధైర్యంగా ఎదురు తిరగటం ద్వారా అసలేమీ కాదన్న విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

Tags:    

Similar News