ప్రపంచ వేదికపై రేవంత్ రెడ్డి-చంద్రబాబు 'ఒకే టైం.. ఒకే చోటు'.. విషయం ఏంటి?
ఈ నెల 20 నుంచి ఐదు రోజుల పాటు అంటే 25వ తేదీ వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో ప్రపంచ స్థాయి పెట్టుబడుల సదస్సు-55 జరగనుంది.
ఏపీ సీఎం చంద్రబాబు-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య పాలనలో పెద్దగా పోటీ లేకపోయినా.. ఎవరూ పోటీ పడుతు న్నట్టు కనిపించకపోయినా.. అంతర్గత చర్చల్లో మాత్రం తరచుగా.. ఇరువురి పాలనపైనా కామెంట్లు వినిపిస్తూనే ఉంటాయి. అనే క మార్పులు.. నిర్ణయాలు కూడా.. చర్చకు వస్తూనే ఉన్నాయి. తాజాగా.. ఇద్దరు సీఎంలు కూడా ప్రపంచ పెట్టుబడుల సదస్సు లో ఎదురెదురు పడనున్నారు. ఈ నెల 20 నుంచి ఐదు రోజుల పాటు అంటే 25వ తేదీ వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో ప్రపంచ స్థాయి పెట్టుబడుల సదస్సు-55 జరగనుంది.
ఈ సదస్సులో పాల్గొని పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇరువురు సీఎంలు కూడా ఈ నెలలో దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 15 నుంచే విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాల్లో ఆయన 20వ తేదీ వరకు పర్యటించనున్నారు. అక్కడి క్రీడా ప్రాంగణాలను పరిశీలించనున్నారు. ప్రపంచ స్థాయిలో నిర్మించిన క్రీడా ప్రాంగణాలను పరిశీలించి.. అలాంటివాటినే తెలంగాణలోనూ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా ఆస్ట్రేలియాలో క్వీన్స్ లాండ్ యూనివర్సిటీని కూడా సందర్శించనున్నారు. ఇతర మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం దావోస్‌కు చేసుకుంటారు.
దావోస్‌లో ఈ నెల 20 నుంచి జరగనున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 21 నుంచి పలువురు తన కేబినెట్ మంత్రులతో కలిసి పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల సదుపాయాలను వివరించి.. పెట్టుబడులు ఆహ్వానించనున్నారు. అయితే.. ఇదేసమయంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా తన మంత్రివర్గ సహచరులతో కలిసి దావోస్‌లో పర్యటించనున్నారు. భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు బృందం కూడా.. దావోస్‌లో పర్యటించనున్నది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏమేరకు పెట్టుబడులు సాధిస్తారు? అనేది ఆసక్తిగా మారింది.
ఇద్దరు సీఎంలు.. గతంలో కలిసి పనిచేయడం.. ఒక పార్టీలో ఉండడంతోపాటు.. ఇరువురు నాయకులు కూడా విజన్ ఉన్నవారి గానే గుర్తింపు పొందడంతో ఈ చర్చ మరింత పెరిగింది. పైగా పెట్టుబడుల సాధనలో అటు తెలంగాణ సీఎం, ఇటు ఏపీ సీఎంలు కూడా.. కసితో ఉన్నారు. మంచి ఆకలిపైనా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరు ఎంత మేరకు పెట్టుబడులు సాధిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇక, గత 2024 జనవరిలో జరిగిన దావోస్ పెట్టుబడుల సదస్సులో తెలంగాణ సీఎం పాల్గొని 40 వేల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు సాధించారు. కానీ, వాటికి సంబంధించిన సంస్థలు ఇంకా ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం ఇవి ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. ఇక, కూటమి సర్కారు పగ్గాలు చేపట్టాక.. ఏపీ తరఫున చంద్రబాబు దావోస్‌కు వెళ్తుండడం ఇదే తొలిసారి.