కులగణన మీద సందేహాలకు చెక్ చెప్పే రేవంత్ వివరణ ఇది

కొన్ని వివరాల్ని వెల్లడించటం.. వాటితో తాజా సర్వేను పోల్చటంతో కొత్త సందేహాలు వ్యక్తం కావటమేకాదు.. కొంత అయోమయానికి గురయ్యే పరిస్థితి.

Update: 2025-02-16 06:30 GMT

రేవంత్ సర్కారు చేపట్టిన కులగణన మీద పలు సందేహాలు వ్యక్తం కావటం.. సదరు సర్వే సరిగా సాగలేదన్న ప్రచారం తెలిసిందే. ఇక్కడే పలువురు కేసీఆర్ సర్కారు హయాంలో నిర్వహించిన సర్వేను ప్రస్తావిస్తున్నారు. నిజానికి ఈ సర్వే రిపోర్టు పూర్తిగా బయటకు వచ్చింది లేదు. కొన్ని వివరాల్ని వెల్లడించటం.. వాటితో తాజా సర్వేను పోల్చటంతో కొత్త సందేహాలు వ్యక్తం కావటమేకాదు.. కొంత అయోమయానికి గురయ్యే పరిస్థితి.

తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన మీద సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వ సర్వేకు.. తమ సర్కారు లెక్కలకు మధ్య తేడాను వివరించారు. ఇంతకూ సీఎం రేవంత్ ఏం చెప్పారు? ఆయన వివరణలోని అంశాలు ఏం ఉన్నాయి? అన్నది చూస్తే..

- కేసీఆర్ హయాంలో చేసిన సర్వేకు.. మేం చేసిన సర్వేకు చాలా తేడా ఉంది. అప్పట్లో సమాజాన్ని బీసీ 51 శాతం.. ఎస్సీ 18 శాతం.. ఎస్టీ 10 శాతం.. ఓసీ 21 శాతంగా చూపించారు. ముస్లింలను ప్రత్యేకంగా చూపలేదు.

- మేం మొత్తంగా ఐదు కేటగిరీలుగా విభజించి ముస్లింలు ఉన్న ఓసీ.. బీసీలను కూడా ప్రత్యేకంగా చూపించాం. దాని ప్రకారం హిందూ.. ముస్లింలలోని వెనుకబడిన తరగతుల సంఖ్య 56 శాతానికి పెరిగింది.

- కేసీఆర్ చేయించిన సర్వేలో వీరి సంఖ్య 51 శాతం మాత్రమే ఉన్నట్లు తేలింది. అంటే.. బీసీలు 5 శాతం పెరిగినట్లు లెక్క.

- రాష్ట్ట్రంలో ఎస్సీ ఉపకులాలన్నీ కలిపి 59 ఉంటే.. కేసీఆర్ హయాంలో 82గా చూపించారు. ఇప్పుడు బీసీల్లో 46.25 శాతం హిందువులు.. 10.08 శాతం ముస్లింలు ఉన్నారు. గతంలో 21 శాతం ఉన్న ఓసీ సంఖ్య ఇప్పుడు 15.5 శాతానికి తగ్గింది.

- స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు మొత్తం బీసీలకు కలిపి ఇస్తున్నారు కనుక అందులో ఎవరూ చేయగలిగింది లేదు. ఇదివరకు ముస్లింలు 17 శాతం ఉన్నారని చెప్పేటోళ్లు.. ఇప్పుడు అది 12.56 శాతంగా తేలింది.

- కులగణన.. ఎస్సీ వర్గీకరణలో తెలంగాణ దేశానికి ఒక రోడ్ మ్యాప్ చూపింది. సర్వే అన్నది మొదటి దశ. మిగిలిపోయిన వారు కులగణనలో పాల్గొన్న తర్వాత మార్చి మొదటివారంలో దాన్ని క్రోడీకరిస్తాం.

- ఆయా వర్గాలకు సంక్షేమం ఎలా అందించాలన్న దానిపై కొత్తగా కమిషన్ కానీ కమిటీ కానీ ఏర్పాటు చేస్తాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి చట్టబద్ధత కల్పిస్తాం.

- ఎవరూ టచ్ చేయని అంశాలపై మేం ధైర్యంగా ముందుకు వెళ్లాం. 1931 తర్వాత దేశంలో కులగణనే జరగలేదు. అలాంటప్పుడు ఏ కులం జనాభా ఎంతన్నది ఏ డాక్యుమెంట్ చెబుతుంది?

- ఇప్పుడు మేం చేసిందే అధికారిక డాక్యుమెంట్. ఇది ప్రజలు స్వయంగా ప్రకటించిన సమాచారమే తప్పించి.. ప్రభుత్వం క్రియేట్ చేసింది కాదు.

- 50 రోజుల్లో సేకరించిన డేటాను కరెక్ట్ గా ప్రకటించాం. అందులో అక్షరం తప్పు లేదు. డబుల్ ఎంట్రీలు లేవు. ఆస్తులు ఎవరైనా తప్పు చెబుతారేమో కానీ కులం గురించి ఎందుకు తప్పు చెబుతారు?

- ఇది వరకు కేసీఆర్ చేసిన సమాచార సేకరణకు చట్టబద్ధత లేదు. పదేళ్లు ఆయన వివరాల్ని దాచుకున్నారే తప్పించి మంత్రివర్గం ముందుకు వెళ్లలేదు.. అసెంబ్లీ ముందుకు కూడా రాలేదు. కానీ.. మేం మాత్రం కాబినెట్ ముందుకు.. అసెంబ్లీల ముందుకు పెట్టాం. మా సర్వేకు.. కేసీఆర్ సర్వేకు పోలికే లేదు.

Tags:    

Similar News