'పుష్ప-2' ఘటనపై పూసగుచ్చినట్లు వివరణ... రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
ఇందులో భాగంగా... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆరెస్స్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.
'పుష్ప-2' సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిలసాట ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రాజకీయంగానూ తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఇందులో భాగంగా... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆరెస్స్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్న నేపథ్యంలో.. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ... ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, బాలుడు తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నాడని.. ఈ వ్యవహరంలో ఏమి జరుగుతుందో ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు.
దీంతో... ఈ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ప్రకటన చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఈ విషయం అసెంబ్లీలో ప్రస్థావనకు వస్తుందని అనుకోలేదని.. ఈ వ్యవహారం ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్నందున పెద్దగా మాట్లాడటం సరైంది కాదని అని అన్నారు.
ఈ సందర్భంగా... డిసెంబర్ 2న చిక్కడపల్లి పీఎస్ లో సంధ్య థియేటర్ యాజమాన్యం దరఖాస్తు చేశారని.. ఈ నెల 4న పుష్ప-2 సినిమా విడుదలవుతుందని.. ఆ రోజు ఆ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్, నిర్మాత మరికొంతమంది థియేటర్ కు వస్తున్నారని.. బందోబస్తు కల్పించాలని దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
అయితే... మరుసటి రోజు చిక్కడపల్లి సీఐ సంధ్య థియేటర్ యాజమాన్యానికి లిఖితపూర్వక సమాధానం పంపించారని అన్నారు. ఇందులో భాగంగా... సంధ్య థియేటర్ పరిసరాల్లో రెస్టారెంట్లు, ఇతర థియేటర్లు కూడా ఉన్నాయని.. పైగా.. ఈ థియేటర్ కు ఎంట్రీ, ఎగ్జిట్ ఒక్కటే ఉందని.. అందువల్ల సెలబ్రెటీలు వస్తే జనాన్ని అదుపు చేయడం కష్టంగా మారుతుందని పోలీసులు తెలిపారని అన్నారు.
ఈ నేపథ్యంలో హీరో, హీరోయిన్, నిర్మాత ఎవరైనా థియేటర్ కు రావడానికి అనుమతి ఇవ్వొద్దని చెబుతూ థియేటర్ యాజమాన్యం పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు పోలీసులు లిఖితపూర్వకంగా స్పష్టం చేశారని అన్నారు.
అయితే... పోలీసులు ఆ విధంగా కారణాలు చెబుతూ అనుమతి నిరాకరించినప్పటికీ పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో రోజూ అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చారని.. ఈ సమయంలో తన కారు రూఫ్ టాఫ్ నుంచి చేతులు ఊపుతూ సంధ్య థియేటర్ వద్దకు చేరుకున్నారని.. ఆ సమయంలో తమ అభిమాన నటుడిని చూడాలనే ఉద్దేశ్యంతో చుట్టుపక్కల అభిమానులంతా ఇక్కడికే వచ్చారని అన్నారు.
ఆ సమయంలో సదరు హీరో కారు థియేటర్ లోపలికి పంపించేందుకు గేటు తెరిచారని.. దీంతో ఒక్కసారి వందల సంఖ్యలో అభిమానులందరూ థియేటర్ లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారని.. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోయారని.. ఈ సమయంలోనే ఆమె కుమారుడు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని వివరించారు.
ఆ సమయంలో పరిస్థితి చేయిదాటిపోయిందని.. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అల్లు అర్జున్ కు పోలీసులు చెప్పాలని ప్రయత్నించారని.. ఈ సమయంలో అల్లు అర్జు వద్దకు వెళ్లకుండా థియేటర్ యాజమాన్యం పోలీసులను బ్లాక్ చేశారని.. ఈ క్రమంలో ఏసీపీ వెళ్లి అల్లు అర్జున్ కు పరిస్థితి వివరించారని.. అక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పారని స్పష్టం చేశారు.
అయినప్పటికీ... సినిమా చూసే వెళ్తానని అల్లు అర్జున్ అన్నట్లు సిటీ కమిషనర్ తనతో చెప్పారని రేవంత్ పేర్కొన్నారు. ఈ సమయంలో ఏదోవిధంగా పోలీసులు బలవంతం చేసి థియేటర్ నుంచి పంపించే ఏర్పాట్లు చేస్తే.. మరోసారి రూఫ్ టాప్ ద్వారా చేతులు ఊపుతూ వెళ్లారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ తో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేశారని అన్నారు.
ఈ క్రమంలో... తొక్కిసలాటలో మహిళ చనిపోయి, కుమారుడు చావుబతుకుల్లో ఉన్నా 11 రోజుల తర్వాత వరకూ ఆ సినిమా హీరో, ప్రొడ్యూసర్ ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదని.. ఆస్పత్రిలో ఉన్న పిల్లాడిని పరామర్శించడానికి వెళ్లలేదని.. బెయిల్ పై విడుదలైన నటుడిని పరామర్శించడానికి మాత్రం సినీ ప్రముఖులు అతని ఇంటి వద్ద క్యూ కట్టారని రేవంత్ ఘాటుగా స్పందించారు.
ఇందులో భాగంగా... ఈ ఘటనలో హీరో కన్ను పోయిందా, కాలు పోయిందా, కిడ్నీ పోయిందా, ఏమి పోయింది.. అతన్ని పరామర్శిస్తున్నారు, ప్రభుత్వాన్ని తిడుతున్నారు అని అన్నారు. ఇలా హీరో ఇంటికి క్యూ కట్టారు కానీ.. ఆస్పత్రిలో ఉన్న పిల్లగాడిని పరామర్శించడానికి ముందుకురాలేదని రేవంత్ మండిపడ్డారు!
ఈ సందర్భంగా... సినిమా ప్రముఖులకు ఒక్కటే చెబుతున్నా అని మొదలుపెట్టిన రేవంత్... "సినిమాలు తీసుకోండి.. వ్యాపారం చేసుకోండి.. డబ్బులు సంపాదించుకోండి.. ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు తీసుకోండి.. షూటింగ్ లకు సంబంధించి అనుమతులు కూడా తీసుకోండి.. కానీ... ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.. నేను కుర్చీలో ఉన్నంత వరకూ ఇలాంటి ఘటనలు ఉపేక్షించను" అని స్పష్టం చేశారు.