గరం.. నరం.. బేశరమ్.. రేవంత్ మాటలు చదవాల్సిందే

అంతేకాదు.. సదరు మాటలు తనకు కూడా వర్తిస్తాయని వ్యాఖ్యానించటం ద్వారా.. రేవంత్ రెడ్డి మజాకానా? అన్న భావన కలిగేలా చేశారు.

Update: 2024-10-07 06:27 GMT

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడేం చెప్పాలో.. ఎలాంటి సిట్యూవేషన్ ను ఎలా మార్చాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. అలాంటి రేవంత్ రెడ్డి.. తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని.. అందరూ ఇట్టే కనెక్టు అయ్యే మాటను చెప్పారు. అంతేకాదు.. సదరు మాటలు తనకు కూడా వర్తిస్తాయని వ్యాఖ్యానించటం ద్వారా.. రేవంత్ రెడ్డి మజాకానా? అన్న భావన కలిగేలా చేశారు.

ఆయన తాజా స్పీచ్ లో వాడిన గరం.. నరం.. బేశరమ్ అంటూ అంత్యప్రాసలతో అదరగొట్టిన వైనం ఆసక్తికరంగా మారింది. ఇంతకు ఆయన చెప్పిన మాటల సారాంశం ఏమిటన్నది చూస్తే.. ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఉద్యోగులు ఎలా వ్యవహరిస్తారు? సర్వీసులో కొంతకాలం గడిచిన తర్వాత తీరు ఎలా ఉంటుంది? రిటైర్మెంట్ వేళలో వారి తీరు ఉండే తీరును కళ్లకు కట్టినట్లుగా చెప్పారు. ఉద్యోగస్తులే కాదు.. రాజకీయ నేతలు కూడా ఇలానే వ్యవహరిస్తారని వ్యాఖ్యానించటం విశేషం. ఈ విషయాన్ని సీఎం రేవంత్ నోటి మాటలతో చదివితే మరింత బాగుంటుంది. ఆయనేమన్నారంటే..

‘‘రాజకీయాలు.. ప్రభుత్వ ఉద్యోగాల్లో మొత్తం 3 దశలు ఉంటాయని ఒక పెద్దాయన నాకు చెప్పారు. చేరినప్పుడు గరంగా ఉంటారు. (ఆవేశంగా.. ముక్కుసూటిగా ఉంటారు) కొంతకాలానికి నరంగా (మెత్తగా) అవుతారట. చివరకు వచ్చేసరికి బేశరమ్ (సిగ్గు లేకుండా) అవుతారట. జాబ్ లో చేరినప్పుడు ఎంత గరంగా ఉన్నారో.. పదవీ విరమణ చేసే వరకు అలానే ఉండండి. ఈ నానుడి నాకు.. మీకు వర్తించకుండా చూసుకుందాం’’ అని వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి.. గులాబీ బాస్ కేసీఆరర్ ను ప్రస్తావించారు. కేసీఆర్ కు కొంతకాలం తెలంగాణ ఉద్యమమనే ముసుగు.. రక్షణ కవచం ఉన్నాయని.. ఆ గొప్పతనం కేసీఆర్ ది కాదని.. తెలంగాణ ఉద్యమానిదన్నారు. ‘ఈ రోజు ముసుగు తొలిగిపోయింది. ఆయన ముఖం చెల్లక ఎక్కడో ఉన్నారు’ అంటూ వ్యాఖ్యానించారు. మొత్తానికి మంచి మాటలు చెబుతూనే.. మరోవైపు కేసీఆర్ ను మాట అనే అవకాశాన్ని ఏ మాత్రం విడిచిపెట్టని వైనం సీఎం రేవంత్ లో కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు.

Tags:    

Similar News