తెలుగు పాలిటిక్స్ 2024 : పవర్ ఫుల్ లీడర్ గా రేవంత్ రెడ్డి !
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినపుడు రేసులో కొందరు సీనియర్లు పోటీ పడి మంత్రులు అయ్యారు.
తెలంగాణా ముఖ్యమంత్రి రేన్వంత్ రెడ్డికి అదృష్టం తెచ్చినది 2023 ఏడాది అయితే ఆయన ఎంతటి పవర్ ఫుల్ లీడర్ అన్నది 2024 చాటి చెప్పింది. ఆయనకు ఈ ఏడాది ఎండింగ్ తో ఏడాది పాలన సీఎం గా పూర్తి అయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినపుడు రేసులో కొందరు సీనియర్లు పోటీ పడి మంత్రులు అయ్యారు.
అలా కొంత కాంగ్రెస్ తరహా పోటీ వాతావరణం అయితే ఆయనకు పార్టీలో ఉంది. కానీ 2024లో అది పూర్తిగా మారిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 17 సీట్లకు మెజారిటీ అయితే కాంగ్రెస్ గెలుచుకోలేదు. బీజేపీతో సమానంగా ఎనిమిది మంది ఎంపీలనే రేవంత్ రెడ్డి సారధ్యంలో గెలిపించగలిగారు.
అయినా సరే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం వద్ద ఆయన పలుకుబడి ఏ మాత్రం తగ్గలేదు. ఆయన ఏమి చేసినా గో ఎహెడ్ అన్నట్లుగానే పరిస్థితి ఉంది. ఒకనాడు వైఎస్సార్ అత్యధిక స్వేచ్చను కాంగ్రెస్ సీఎం గా అనుభవించారు. ఆ స్థాయిలో కాకపోయినా ఇంచుమించుగా అదే మాదిరిగా రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్ లో ఫ్రీ హ్యాండ్ తీసుకుని దూకుడు చేస్తున్నారు.
ఆయనలోని రెండవ కోణాన్ని ఆవిష్కరించిన ఏడాదిగా 2024ని చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి నో మొహమాటమ్స్ అన్నట్లుగా తన పని తాను చేసుకుని పోతున్నారు. హైడ్రా పేరుతో ఆయన భారీ నిర్మాణాలను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని కూల్చివేయడంతో అసలు సిసలు తనదైన పాలనకు తెర తీశారు. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖుడు అయిన అక్కినేని నాగార్జున ఎన్ కన్వెషన్ ని సైతం కూల్చేశారు.
అదే విధంగా చాలా మంది నిర్మాణాలూ కూల్చబడ్డాయి. మూసీ నది సుందరీకరణ పేరుతో మరో కార్యక్రమం చేపట్టారు. తన పట్టుదలను ఆయన ఈ విషయంలో చూపాల్సినంతగా చూపుతున్నారు. ఇక టాలీవుడ్ కి సంబంధించి ఒక వైపు వరాలు ఇస్తూనే మరో వైపు బిగిస్తున్నారు. డ్రగ్స్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తేనే టికెట్ల ధరల పెంపు అని ఒక కండిషన్ అయితే ఆయన పెట్టారు. అయినా సరే ఇది బాగానే ఉంది అనుకున్నారు. టాలీవుడ్ కి తన సాయం ఉంటుందని చెబుతూనే ప్రభుత్వానికి కూడా సహకరించాలని కోరుతున్నారు
ఇక టాలీవుడ్ టాప్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయితె ఈ ఏడాది ఎండింగులో టాలీవుడ్ ని కుదిపేసిన అతి పెద్ద సంచలనంగా చెప్పాలి. తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచ ఖ్యాతిని గడిస్తున్న నేపధ్యంలో పుష్ప టూ సూపర్ సక్సెస్ అయిన క్రమంలో పాన్ ఇండియా హీరోగా ఎస్టాబ్లిష్ అయిన అల్లు అర్జున్ అరెస్ట్ జాతీయ స్థాయిలో కుదిపేసింది. దానికి గల కారణాలను జాతీయ మీడియాకు అలాగే తెలంగాణా అసెంబ్లీలోనూ తెలియజేయడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాల్సినవి అన్నీ చెప్పేశారు. అంతే కాదు 2024 ముగియనున్న నేపధ్యంలో టాలీవుడ్ కి చేదు వార్తనే వినిపించారు.
తాను సీఎం గా ఉన్నంత కాలం బెనిఫిట్ షోలు ఉండవని, అలాగే టికెట్ ధరలు పెంచడం అన్నది ఉండదని కూడా సంచలన ప్రకటన చేశారు. ఈ విధంగా టాలీవుడ్ కి తెలంగాణా ప్రభుత్వ గట్టి షాక్ ఇచ్చేసింది. రేవంత్ రెడ్డి టాలీవుడ్ కి వరాలు ఇస్తున్నారు అని ముగిసేలోగానే ఆయన తాను కచ్చితంగానూ ఉంటాను అని చెప్పేస్తున్నారు.
ఇటీవల టాలీవుడ్ మరో ప్రముఖుడు నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు అధికారులు వచ్చి మార్కింగ్స్ తీయడం భూసేకరణలో భాంగా కొంతభాగం ఆయన స్థలం కూడా పోతుందని వార్తలు రావడమూ కలకలం రేపింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన రేవంత్ రెడ్డి చంద్రబాబుతో తన రిలేషన్స్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలే చేశారు.
గురువు శిష్యుడూ అని ఆయననూ తనను కలిపి అంటే ఊరుకోనని స్పష్టం చేశారు. తాను బాబుకు ఒకనాడు సహచరుడిని అన్నారు. ఆయన మీద తనకు అపారమైన గౌరవం ఉందని కూడా చెప్పుకున్నారు. ఇలా రేవంత్ రెడ్డి అయితే తనదైన కచ్చితత్వంతో దూకుడుతోనే పాలన సాగిస్తున్నారు. ఏడాది చివరిలో కేటీఆర్ మీద ఏసీబీ కేసు పెట్టింది. దాంతో బీఆర్ఎస్ తో రాజకీయ సమరం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేశారు.
ఈ రోజున దేశంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కొంత ఇబ్బందిని ఎదుర్కోంటోంది. పెద్ద రాష్ట్రాలుగా కర్ణాటక, తెలంగాణా మాత్రమే ఆ కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. వివిధ రాష్ట్రాలలో ఎన్నికల్లో పరాజయాలు వెక్కిరిస్తున్నాయి. దాంతో జాతీయ నాయకత్వం కూడా రేవంత్ రెడ్డిని కొనసాగిస్తూ ఆయనకు మద్దతుగానే నిలుస్తోంది. దాంతో రేవంత్ రెడ్డి పూర్తి అధికారాలతో గతంలో వైఎస్సార్ తప్ప ఏ కాంగ్రెస్ సీఎం కి దక్కనంత ఫ్రీడం ని తిరిగి అనుకుంటున్నారు అని అంటున్నారు. ఆ విధంగా ఆయన అందివచ్చిన అవకాశాలతో దూసుకుని పోతున్నారు.