దావోస్ వేదికగా బాబు గురించి రేవంత్ అన్నదేంటంటే ?

దావోస్ వేదికగా ఏపీ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రులు కలుసుకుంటున్నారు. ఇద్దరూ కలసి సమావేశాలకు హాజరవుతున్నారు.

Update: 2025-01-22 16:49 GMT

దావోస్ వేదికగా ఏపీ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రులు కలుసుకుంటున్నారు. ఇద్దరూ కలసి సమావేశాలకు హాజరవుతున్నారు. మంచి వాతావరణంలో ప్రపంచ వేదిక మీద ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల కోసం చేస్తున్న కృషి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే దావోస్ వేదికగా చంద్రబాబుని రేవంత్ రెడ్డి ఆకాశానికి ఎత్తేశారు. ఈ రోజు తెలంగాణా ఈ పరిస్థితిలో ఉంది అంటే దానికి చంద్రబాబు నాడు చేసిన కృషి కారణం అని ఆయన కితాబు ఇచ్చారు.

చంద్రబాబు తొలిసారి 1995లో సీఎం అయ్యారు. అలా ఆయన తొంబయ్యవ దశకంలొ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేసిన ఐటీ అభివృద్ధి అలాగే మౌలిక సదుపాయాల కల్పన విషయంలో తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ఏపీని గ్లోబల్ సిటీగా హైదరాబాద్ ని మార్చేశాయని రేవంత్ రెడ్డి చెప్పడం విశేషం.

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సహచర ముఖ్యమంత్రులు చంద్రబాబు, దేవేంద్ర ఫడ్నవీస్‌లతో కలిసి నిర్వహించిన ఒక కీలక సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ ని ప్రపంచానికి ఒక కీలక గమ్యస్థానంగా మార్చడానికి తొంబై దశకంలో చంద్రబాబు చేసిన కృషి ఎన్నతగినది అని అన్నారు. ఆ తరువాత వచ్చిన సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా దీనిని పరి పూర్తి చేశారని అన్నారు. అలా చంద్రబాబు, వైఎస్సార్ హైదరాబాద్‌ని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. ఇక్ బాబు హయాంలో ఆనాడు స్థాపించబడిన సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఐటి ఆర్కిటెక్చర్ వల్లనే ఈ రోజు హైదరాబాద్ అన్ని విధాలుగా ముందుకు సాగుతోందని రేవంత్ రెడ్డి అన్నారు.

ఈ విధంగా రేవంత్ రెడ్డి చెప్పడం నిజంగా బాబు సాధించిన కృషికి సరైన ఫలితం అని అంటున్నారు. దశాబ్దాలు గడచినా బాబు చేసిన మేలు ఏంటి అన్నది అందరికీ అర్థం అయింది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఆంధ్ర లాగే తెలంగాణ కూడా భవిష్యత్తులో వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉండాలని కోరుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పడం కూడా విశేషం.

ఇక ఏపీ సీఎం అయితే ఇక్కడ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర తెలంగాణ రెండూ ధనిక రాష్ట్రాలు, ఏపీ పేద రాష్ట్రం అన్నారు. తాము అనుకున్న లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడాలని బాబు చెప్పుకొచ్చారు. అయితే తాను దానిని సాధించడానికి ప్రయత్నిస్తానని చెప్పడం విశేషం. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా బాబు మీద చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News