మోడీ ముల్లె అడుగుతున్న‌మా? : రేవంత్‌

పైగా.. కేంద్ర మంత్రులు ఇద్దరు(కిష‌న్‌రెడ్డి, బండి సంజ‌య్‌)ఉండి వారేమీ నిధులు కావాల‌ని అడ‌గ‌డం లేద‌ని.. చెబుతున్నార‌ని అన్నారు.;

Update: 2025-03-01 03:15 GMT

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. తాను ప‌దే ప‌దే ఢిల్లీకి వెళ్లినిధులు ఇవ్వాల‌ని అడుగుతున్నా పైసా కూడా ఇవ్వ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ``మోడీ ముల్లె అడుగుతున్న‌మా?`` అని ఆయ‌న ప్ర‌శ్నించారు. కేంద్ర బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం చేశార‌ని.. ఒక్క పైసా కూడా కేటాయించ‌లేద‌న్నారు. అనేక ప్రాజెక్టుల‌కు నిధులు కేటాయించాల్సి ఉంద‌న్న ఆయ‌న‌.. దీనిపై అనేక సార్లు కేంద్రానికి తాను విజ్ఞ‌ప్తి చేసినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పైగా.. కేంద్ర మంత్రులు ఇద్దరు(కిష‌న్‌రెడ్డి, బండి సంజ‌య్‌)ఉండి వారేమీ నిధులు కావాల‌ని అడ‌గ‌డం లేద‌ని.. చెబుతున్నార‌ని అన్నారు.

రాష్ట్రం నుంచి ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా ఉన్న‌వారు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌ట్టించుకోరా? అని రేవంత్‌రెడ్డి నిల‌దీశారు. తెలంగాణ‌కు అధికారికంగా రావాల్సిన సొమ్మునే తాము అడుగుతున్నాం కానీ.. మోడీ ఆస్తిపాస్తుల నుంచి వాటాలు కోరుకోవ‌డం లేద ని వ్యాఖ్యానించారు. బిహార్, ఉత్తరప్రదేశ్‌కు ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణకి ఇవ్వరా అని కేంద్రాన్ని నిల‌దీశారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి స‌మావేశం త‌ర్వాత‌.. సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు పెండింగులో పెట్టి.. అప్పులు చేసి.. త‌మ‌కు అప్ప‌గించార‌ని బీఆర్ ఎస్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల‌ని తాము చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు ఇప్పుడు కేంద్రం ఏమాత్రం స‌హ‌క‌రించ‌డం లేద‌న్నారు. పైగా.. ``రాష్ట్రంలో ఇద్ద‌రు కేంద్ర మంత్రులు ఉన్నారు. బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల స‌మ‌యంలో వారు ఏమీ చెప్ప‌లేదు`` అని మోడీ స్వ‌యంగా త‌న‌తో చెప్పిన‌ట్టు రేవంత్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న ప్రాజెక్ట్‌లకు అనుమతులు, నిధులు తెచ్చాకే.. కిషన్ రెడ్డి తెలంగాణలో అడుగు పెట్టాల‌ని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేంద్రం ప్రత్యేకంగా తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదన్న విష‌యాన్ని కిష‌న్ రెడ్డి గుర్తు పెట్టుకోవాల‌ని, కిషన్ రెడ్డి మాట్లాడుతున్న విధానం చూస్తే తనకు నవ్వొస్తుందని వ్యాఖ్యానించారు.

పార్టీ పున‌ర్నిర్మాణం!

రాష్ట్రంలో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందిస్తామ‌ని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. పార్టీని క్షేత్ర‌స్థాయి నుంచి మ‌రింత బ‌లోపేతం చేస్తామ‌ని తెలిపారు. ప‌ద‌వులు రాని వారు అసంతృప్తిగా ఉన్నార‌ని త‌న‌కు కూడా తెలుసున‌న్న ఆయ‌న క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తేనే ప‌దవులు ద‌క్కుతాయ‌న్నారు. పార్టీ త‌ర‌ఫున చేయాల్సింది చాలానే వుంద‌ని న‌ర్మ‌గ‌ర్భంగా స‌ద‌రు నేత‌ల‌కు ఆయ‌న సూచించారు.

ఏపీపై సూటిగా

సీఎం రేవంత్ రెడ్డి ఏపీపైనా సూటి వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీని ఉద్దేశించి ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పిస్తూ.. ద‌మ్ముంటే ఏపీలోనూ మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేయాల‌ని బీజేపీకి సవాల్ విసిరారు. అంతేకాదు.. ఏపీలో ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయడం లేదని ఆయ‌న నిల‌దీశారు. విభ‌జ‌న క‌ష్టాలు కేవ‌లం ఏపీకే లేవ‌న్న ఆయ‌న తెలంగాణ కూడా బాధిత రాష్ట్ర‌మేన‌ని.. కేంద్రంలోని మోడీ స‌ర్కారు అనుస‌రిస్తున్న వైఖ‌రితో న‌ష్ట‌పోతున్నామ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

Tags:    

Similar News