హైడ్రాపై వెనక్కి తగ్గని రేవంత్.. మరోసారి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ మహానగరంలో, చుట్టు పక్కల ప్రాంతాల్లో చెరువులను, కుంటలను, నాలాలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిని తెలంగాణ ప్రభుత్వం వదలడం లేదు.

Update: 2024-09-18 07:08 GMT

హైదరాబాద్ మహానగరంలో, చుట్టు పక్కల ప్రాంతాల్లో చెరువులను, కుంటలను, నాలాలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిని తెలంగాణ ప్రభుత్వం వదలడం లేదు. ఇందు కోసం ఏర్పాటైన హైడ్రా పేరు వింటేనే ఇప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. ఏపీలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కొందరు ఇప్పటికే స్వతహాగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తుండగా.. మరికొందరేమో కూల్చేందుకు సిద్ధమవుతున్నారు.

హైడ్రా ఏర్పాటు నుంచి ఆ వ్యవస్థ ఎక్కడ కూడా ఎవరికి అదిరింది లేదు.. బెదిరింది లేదు. పేద, ధనిక, పొలిటికల్, సినీ రంగాలంటూ తేడాలు లేకుండా అందరి భరతం పడుతోంది. ఇప్పటికే వందలాది సంఖ్యలో నిర్మాణాలు కూల్చగా.. వెయ్యి ఎకరాలకు పైగా స్థలాన్ని రికవరీ చేశారు. దాంతో మెజార్టీ ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నగర ప్రజల్లో అయితే మరీను.

ఏటా వర్షాకాలం వచ్చిందంటే భాగ్యనగరం వరదలతో ముంచెత్తుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. రోడ్లన్నీ మునిగిపోతున్నాయి. వరదలతో జనం అతలాకుతలం అవుతోంది. అయితే.. దీనికి ప్రధాన కారణం చెరువులు, కుంటలు, నాలాల కబ్జానేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. అందుకే.. వాటిని కబ్జా నుంచి రక్షించి మహానగరాన్ని వరద ముప్పు నుంచి కాపాడాలని భావించారు. అందుకే హైడ్రా ఏర్పాటు చేశారు. హైడ్రా చిన్న వ్యవస్థగా ఏర్పాటైనప్పటికీ.. ముందు ముందు దానికి విశేష అధికారాలు అప్పజెప్పేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ప్రజల నుంచి సానుకూలంగా స్పందన వస్తున్నా.. పొలిటికల్ నుంచి మాత్రం విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. పేదల ఇళ్లు కూల్చడమే ప్రభుత్వ లక్ష్యమా అంటూ నిలదీస్తున్నారు. వారికి ముఖ్యమంత్రి రేవంత్ ఎప్పటికప్పుడు సమాధానాలు ఇస్తూ వస్తున్నారు.

తాజాగా.. సెప్టెంబర్ 17 వేడుకల సందర్భంగానూ హైడ్రాపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరస్సుల పరిరక్షణకు హైడ్రా పనిచేస్తుందని, హైడ్రాకు పూర్తిస్థాయి అధికారాలు అప్పగించేందుకు ప్రభుత్వం త్వరలో ఆర్డినెన్స్ తీసుకురానుందని చెప్పారు. ఒకప్పుడు సరస్సుల నగరంగా పిలిచే హైదరాబాద్ నగరం ఇప్పుడు వరదల నగరంగా మారడంపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

నగరం ఈ పరిస్థితికి చేరుకోవడానికి గత ప్రభుత్వమే కారణమని రేవంత్ విమర్శించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా అనధికార నిర్మాణాలపై హైడ్రా పని ఆగదు అని, కూల్చివేతలు తప్పవని స్పష్టం చేశారు. చెరువులు, కుంటలు, నాలాల, పర్యావరణ పునరుద్ధరణ కోసమే హైడ్రాను స్థాపించామని వెల్లడించారు. మరోవైపు.. హైడ్రాకు ఎలాంటి రాజకీయ కోణం లేదని కూడా స్పష్టం చేశారు. చాలా మంది పొలిటీషియన్లు, అక్రమార్కులు పేదలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చేందుకు చూస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రానే గ్యారంటీ అని, ఇది తన హామీ అని, ప్రజలు తమకు సహకారం అందించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News