సినీ నిర్మాత మరణం....సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణలో రాజకీయ పరిణామాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. ఇటీవలి వరుస పరిణామాలు కాక రేపుతున్నాయి.
తెలంగాణలో రాజకీయ పరిణామాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. ఇటీవలి వరుస పరిణామాలు కాక రేపుతున్నాయి. తాజాగా దుబాయ్ లో తెలుగు సినీ నిర్మాత ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణించడం కూడా వీటి సరసన చేరుతోంది. పైగా ఆ నిర్మాత గతంలో డ్రగ్స్ కేసులో ఉండడం, దుబాయ్ లో ఆయన గదిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉన్నట్లుగా కథనాలు వస్తుండడం దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా వారితో చిట్ చాట్ చేసారు .. ఆ చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేసినట్టు చెబుతున్నారు .
రాష్ట్రంలో మూడు అనుమానాస్పద మరణాలు చోటుచేసుకున్న సంగతిని రేవంత్ ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం చేపట్టిన కాళేశ్వరంపై కేసు వేసిన రాజాలింగమూర్తి హత్యతో పాటు కేటీఆర్ వ్యాపార భాగస్వామి, సినీ నిర్మాత కేదార్ నాథ్ దుబాయ్ లో అనుమానాస్పదంగా చనిపోయాడని, మరోవైపు కాళేశ్వరం, కేదార్ కేసులు హ్యాండిల్ చేస్తున్న సంజీవ్ రెడ్డి కూడా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడాన్ని రేవంత్ లేవనెత్తారు.
దుబాయ్ లో మాజీ ఎమ్మెల్యే ఎందుకు ఉన్నాడు..?
వీరి ముగ్గురి మృతిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ఎందుకు కోరడం లేదని తెలంగాణ సీఎం రేవంత్ నిలదీశారు. ప్రభుత్వాన్ని కోరితే విచారణ చేస్తామని చెప్పారు. ర్యాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో కేదార్ కీలక నిందితుడు. ఈ అనుమానాస్పద మరణాలపై కేటీఆర్ ఎందుకు స్పందించట్లేదు? జ్యుడిషియల్ విచారణ ఎందుకు కోరట్లేదు. కాళేశ్వరం సహా ప్రాజెక్టుల అక్రమాలపై సాంకేతిక నివేదికలు రాకుండా ప్రస్తుతం ఏమీ మాట్లాడను. ఫోన్ ట్యాపింగ్ కేసులో విదేశాల్లో ఉన్న వారిని తీసురావాల్సిన బాధ్యత ఎవరిది? త్వరలో డ్రగ్స్ కేసు విచారణకు రాబోతోంది’’ అని రేవంత్ అన్నారు. అంతేకాదు.. దుబాయ్ లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎందుకు ఉన్నాడని ప్రశ్నించారు.
రేవంత్ తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై నిధులకు ప్రధానమంత్రి మోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోనే ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్‌రోడ్ కమ్ రైలు ప్రాజెక్టు, డ్రైపోర్టు, రక్షణరంగ ప్రాజెక్టులకు సహకరించాలని మోదీని కోరినట్టు తెలిపారు.