దక్షిణాదిపై మోడీ చిన్నచూపు.. రేవంత్‌రెడ్డి
మరోసారి.. మోడీపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలను బయటపెట్టారు.
ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రధానమంత్రి మోడీ, కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మరోసారి తన అసంతృప్తిని వెల్లగక్కారు. మరోసారి.. మోడీపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలను బయటపెట్టారు.
దక్షిణాది రాష్ట్రాలపై ప్రధాని మోడీ చిన్నచూపు చూస్తోందని రేవంత్ మరోసారి ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల ఆదాయంతో కేంద్రం నడుస్తున్నప్పటికీ.. ఈ రాష్ట్రాలపై మాత్రం శీతకన్ను వేస్తున్నదని చెప్పారు. కేంద్రం నుంచి తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వస్తున్న నిధులు అత్తెసరే అని దుయ్యబట్టారు. నిధుల్లోనూ కోత స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్పారు. తెలంగాణ నుంచి కేంద్రానికి ఒక రూపాయి చెల్లిస్తే తిరిగి 40 పైసలు మాత్రమే వస్తున్నాయని తెలిపారు. అదే బిహార్‌కు మాత్రం ఆ రాష్ట్రం రూపాయి ఇస్తే రూ.7.06, ఉత్తరప్రదేశ్ రూపాయి ఇస్తే రూ.2.73 పొందుతున్నాయని ఆరోపించారు.
మోడీ కనుక తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు సరైన మద్దతు ఇస్తే ప్రతీ రాష్ట్రం కూడా ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను తయారు చేయగలదని రేవంత్ చెప్పారు. కుటుంబ నియంత్రణ పాటించాలని ఒత్తిడి తెచ్చిన కేంద్రం.. ఇప్పుడు జనాభా ఆధారంగా నిధులు పంపకాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మరోవైపు.. ప్రస్తుత జనాభా ప్రకారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలని, అలా చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని అన్నారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చి.. అన్నింటినీ ఒకేలా చూడాల్సిన ప్రధాని మోడీ కేవలం గుజరాత్‌కే ప్రధాని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా పెట్టుబడిదారు ముందుకు వస్తే గుజరాత్‌కు వెళ్లమని ప్రధాని కార్యాలయం చెబుతోందని సంచలన ఆరోపణలు చేశారు. కేవలం నాయుడు, నితీశ్ లాంటి వారితోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నదని, మోడీ రాజకీయాలకు ఎక్స్‌పైరీ డేట్ దగ్గర పడిందని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తామని నినదించిన బీజేపీ 240 సీట్లకు పరిమితం అయిందని, కాంగ్రెస్ 40 నుంచి 100కు చేరిందని అన్నారు. నంబర్లు చూస్తే ఎవరు గెలిచారో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.