ఆరు గ్యారంటీలు అమలు కాకపోవడంపై రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇదే క్రమంలో ఇవాళ రైతుభరోసాపై చర్చ జరిగింది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇదే క్రమంలో ఇవాళ రైతుభరోసాపై చర్చ జరిగింది. రైతుభరోసా పథకం అమలు.. లక్ష్యాలు, ఉద్దేశాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించారు.
గత ప్రభుత్వంలో రాళ్లకు, గుట్టలకు రైతుబంధు ఇచ్చేవారని, మనం కూడా అలానే ఇద్దామా అని రేవంత్ ఎద్దేవా చేశారు. తాము అందించే రైతు భరోసాపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని చెప్పారు. రైతులను ఆదుకునే అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు. రైతుభరోసా విధివిధానాలపై ఈ సందర్భంగా తెలిపారు.
ప్రతిపక్ష నేత కేసీఆర్ వచ్చి రైతుబంధుపై సలహాలు, సూచనలు ఇస్తారనుకున్నా అని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ నేతలు నకిలీ పట్టాలతో రైతుబంధు తీసుకున్నారని, ఈ విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు మంచి పనులు చేశారని అనుకుంటే.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఎందుకు కూర్చుంటారని ప్రశ్నించారు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఈ స్కీమ్ తెచ్చారని, కానీ అమలులో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. సాగులో లేని భూములకు సాయం ఎలా ఇస్తారని నిలదీశారు. అలా ఏటా రూ.22,600 కోట్లు లబ్ధి చేశారని తెలిపారు. రియల్ ఎస్టేట్, పారిశ్రామిక వేత్తలకూ ఈ స్కీమ్‌ను వర్తింపజేశారని వెల్లడించారు.
అంతేకాకుండా.. గత ప్రభుత్వంలో చాలా మంది దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసి లబ్ధిపొందారని రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ప్రతీది వ్యాపారమే చేసిందన్నారు. రైతుల ఆత్మహత్యలపై బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని, వెంటనే బీఆర్ఎస్ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అలాగే.. ఆరు గ్యారంటీలపైనా రేవంత్ ఓ క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ వల్లే ఆరు గ్యారంటీలు అమలు చేయలేకోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చేసిన పాపాలు తమకు శాపాలుగా మారాయని అన్నారు. ఈ పాపాల భైరవులు రాష్ట్రాన్ని అమ్మేశారని, కోకాపేట, ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్‌లో భూములు, హైటెక్ సిటీ.. ఇలా అన్నింటినీ అమ్మేశారని సంచలన కామెంట్స్ చేశారు. ఆఖరికి వైన్ షాపులను కూడా మిగల్చలేదని, వీరు చేసిన అప్పులకు నెలకు రూ.6,500 కోట్లు వడ్డీలు కడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలను ఉరితీసినా పాపం లేదని ఫైర్ అయ్యారు. తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ నేతలు మోసం చేశారని అన్నారు. దుబాయి, అరబ్ లాంటి దేశాల్లో అయితే ఇప్పటికే ఇటువంటి వాళ్లను రాళ్లతో కొట్టి చంపేవారని అన్నారు. అధిక వడ్డీతో అప్పులు తెచ్చి.. రాష్ట్రాన్ని బొందలగడ్డలో కలిపారని తెలిపారు. ఇంకా అప్పులు చేయాలని దొంగ లెక్కలు చూపించారని మండిపడ్డారు.