దూసుకెళ్లిన రేవంత్.. దావోస్ లో తెలంగాణ స్కోర్ అదిరిందిగా!

పెట్టుబడులే లక్ష్యంగా జరిపిన దావోస్ టూర్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సర్కారు దూకుడు అందరిని ఆకట్టుకునేలా మారిందని చెప్పాలి.

Update: 2025-01-23 04:56 GMT

పెట్టుబడులే లక్ష్యంగా జరిపిన దావోస్ టూర్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సర్కారు దూకుడు అందరిని ఆకట్టుకునేలా మారిందని చెప్పాలి. దావోస్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అండ్ టీం.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అండ్ టీంతో పాటు ఏపీ ముఖ్యమంత్రిచంద్రబాబు అండ్ కో తోపాటు ఇతర కేంద్రమంత్రులు.. వివిధ రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. వీరందరితో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంటున్న ఒప్పందాల విలువ అంతకంతకూ ఎక్కువగా ఉండటమేకాదు.. మిగిలిన వారి కంటే జోరును ప్రదర్శిస్తున్నట్లుగా చెప్పాలి.

దీంతో తెలంగాణ రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడుల వరద పారినట్లుగా చెప్పాలి. గతంలో ఎప్పుడూ లేనంతగా.. ఒకే రోజులో భారీ పెట్టుబడుల్ని సొంతం చేసుకుంది. బుధవారం ఒక్క రోజుల్లో రూ.56,300 కోట్ల పెట్టుబడుల్ని తెలంగాణ రాష్ట్ర ఆకర్షించింది. అందులో సన్ పెట్రో కెమికల్స్ దేరూ.45,500 కోట్లు ఉండటం విశేషం. పంప్డ్ స్టోరేజీ.. సోలార్ పవర్ ప్రాజెక్టులను ఈ సంస్థ నెలకొల్పనుంది. దీనికి తోడుగా కంట్రోల్ ఎస్ రూ.10వేల కోట్లు.. జేఎస్ డబ్ల్యూ రూ.800 కోట్లతో ఒప్పందాలు జరిగాయి.

మొత్తంగా ఈ ఒప్పందాల కారణంగా 10,800 ఉద్యోగాలు లభించనున్నట్లు చెబుతున్నారు. తాజాగా కుదిరిన ఒప్పందంలో భాగంగా సన్ పెట్రో కెమికల్స్ సంస్థ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్.. మంచిర్యాల.. ములుగు జిల్లాల్లో మూడు చోట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో వపర్ ప్రాజెక్టులను నెలకొల్పనుంది. ఈ మూడు ప్రాజెక్టుల ఇంధన సామర్థ్యం 3400 మెగావాట్లు. వీటికి 5,440 మెగావాట్ల సామర్థ్యం ఉండే సోలార్ విద్యుత్ ప్లాంట్లను అనుసంధానం చేస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే దాదాపు 7వేల ఉద్యోగాలు లభించనున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటివరకు దావోస్ వేదిక మీద తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదేనని చెప్పాలి. సన్ పెట్రో కెమికల్స్ ఎండీ దిలీప్ సాంఘ్వీతో బుధవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబులు ఒప్పందంపై కీలక చర్చలు జరిపారు. ఉన్నతాధికారులు వీరికి సహకరించారు. తాము చేపట్టబోయే ప్రాజెక్టు తెలంగాణలోనే కాదు.. దేశంలోనే అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని సన్ పెట్రో కెమికల్స్ ఎండీ దిలీప్ సాంఘ్వీ ధీమా వ్యక్తం చేయటం గమనార్హం. మొత్తంగా దావోస్ లో రేవంత్ సర్కారు స్కోర్ అదిరిపోయేలా దూసుకెళుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News