రేవంత్ కీలక ఢిల్లీ టూర్.. ‘పెండింగ్’ అన్నీ క్లియర్?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఆయన ఈ పర్యటనకు సిద్ధం అవుతుండగానే తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మారిపోయారు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఆయన ఈ పర్యటనకు సిద్ధం అవుతుండగానే తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మారిపోయారు. మరోవైపు కొన్నాళ్లుగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని కలవలేకపోతున్న రేవంత్.. ఈసారి మాత్రం కచ్చితంగా భేటీ అవనున్నట్లు తెలుస్తోంది. అధిష్ఠానంతో వరుస సమావేశాల అనంతరం రేవంత్ రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయించుకునే అవకాశం ఉంది.
తెలంగాణ కాంగ్రెస్ లో ఇటీవల కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతోపాటు మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వంటి కీలక అంశాలు ఓ కొలిక్కిరావాల్సి ఉంది. వీటిపై రేవంత్.. రాహుల్ తో చర్చించనున్నారు.
అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినా తెలంగాణ మంత్రివర్గంలో ఇంకా కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఆరు ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. విస్తరణ ఏడెనిమిది నెలలుగా వాయిదా పడుతోంది. ఈసారి మాత్రం కొలిక్కి తెచ్చే యోచనలో ఉన్నారు. ఇక టీపీసీసీకి కొత్త ఇంఛార్జ్ రాకతో పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
రాహుల్ టీంలో కీలకంగా ఉన్న మీనాక్షి నటరాజన్ కు తెలంగాణ బాధ్యతలు అప్పగించడం అంటే.. కాంగ్రెస్ హై కమాండ్ ఉద్దేశం ఏమిటో తెలుస్తోందతి.
తెలంగాణలో కులగణన పూర్తితో సూర్యాపేట, గద్వాల్ లో ఏప్రిల్ లో సభలు ఏర్పాటు చేయాలని రేవంత్ భావిస్తున్నారు. ఈ సభలకు రాహుల్ ను ఆహ్వానించనున్నారు. మరో కీలకం అంశం ఎస్సీ వర్గీకరణపై తీసుకున్న నిర్ణయాలను పార్టీ అగ్ర నాయకత్వానికి రేవంత్ వివరించనున్నారు. అయితే, మంత్రివర్గ విస్తరణకు కచ్చితంగా ఆమోదం లభిస్తుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.
సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గ తుది జాబితా, నామినేటెడ్ పదవుల భర్తీపై రాహుల్ తో రేవంత్ చర్చించనున్నారు. స్థానిక ఎన్నికలకు ముందే నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలనేది రేవంత్ ఉద్దేశం.