బీఆర్ఎస్ పాపాలు కడుగుతున్నాం: సీఎం రేవంత్
తాజాగా శనివారం తెలంగాణ అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ సాగింది.
బీఆర్ ఎస్ పదేళ్ల పాలనలో లెక్కకు మించిన తప్పులు చేసిందని.. శిశుపాలుడి పాపాలు పండి.. 2023లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ పాపాలను ఇప్పుడు తాము కడుగుతున్నట్టు తెలిపారు. రైతులకు ఎవరూ చేయని విధంగా తాము మేలు చేస్తున్నామన్నారు. తాజాగా శనివారం తెలంగాణ అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ సాగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్ ఎస్ సర్కారుపై నిప్పులు చెరిగారు.
రైతు బంధు పేరుతో అన్నదాతలను అన్ని విధాలా మోసం చేశారని.. సీఎం విమర్శించారు. తాము వచ్చిన తర్వాత.. రైతు భరోసాను అందరికీ ఇస్తున్నామని.. ఒకరిద్దరు ఎవరైనా అందనివారుంటే.. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించామని తెలిపారు. ఎవరూ మినహాయింపు కాదన్నారు. ప్రతి రైతుకు మేలు చేయాలన్న లక్ష్యంతో తాము ముందుకు సాగుతున్నట్టు వివరించారు. ఇంకా కొంత మంది అందని విషయం తన దృష్టికి కూడా వచ్చిందన్న ఆయన ఎవరినీ వదిలేది లేదన్నారు.
బీఆర్ ఎస్ హయాంలో రైతు బంధు పంపిణీ అస్తవ్యస్తంగా సాగిందని.. అర్హులు చాలా వరకు నష్టపోయారని తెలిపారు. ఇప్పుడు వారిని కూడా గుర్తించి భరోసా నిధులు ఇస్తున్నామని తెలిపారు. రుణ మాఫీ విషయంలో బీఆర్ ఎస్ విష ప్రచారం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ప్రతిపక్ష సభ్యుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. తాము అందరికీ ఇస్తున్నా.. ఇవ్వలేదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ.. ప్రజల్లో అపోహలు సృష్టిం చేప్రయత్నం చేస్తున్నారని.. వీరిని ఎందుకు ఉపేక్షించాలని ఆయన ప్రశ్నించారు.
రైతులను, రైతు సమాజాన్ని ఆదుకోవడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు భరోసాను ప్రతి గ్రామంలోనూ ఇస్తున్నామని.. లేనిపోని విమర్శలతో బీఆర్ ఎస్ నాయకులు.. రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నారని.. వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని ఆ పార్టీ నాయకులకు సూచించారు.